
విజయాలతో తృప్తిపడొద్దు.. ప్రజల్లోనే ఉండాలి: ప్రధాని మోడీ
ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నామనే తృప్తితో ఎన్డీఏ శ్రేణులు నిర్లక్ష్యానికి లోనుకావద్దని ప్రధాని నరేంద్ర మోడీ హితవు పలికారు. ప్రజల పక్షపాత విధానాలు, కష్టపడి చేసిన పని వల్లనే వివిధ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తోందని పేర్కొన్న ఆయన, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ఆ విజయాలతో తృప్తిపడకుండా ప్రజల మధ్య ఉండి పని చేయాలని ప్రధాని ఎంపీలకు సూచించారని తెలిపారు.
ఈ సమావేశంలో 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎన్డీఏ నేతలు ప్రధాని మోడీని ఘనంగా సన్మానించారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం కింద, భారత వస్తువులపై విధిస్తున్న పరస్పర టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించడంపై దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొందని రిజిజు పేర్కొన్నారు. ప్రధాని నాయకత్వంలో మొత్తం 39 అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది చరిత్రాత్మకం. దేశవ్యాప్తంగా దీనిపై సానుకూల వాతావరణం ఉందని ఆయన అన్నారు. శివసేన ఎంపీ మిలింద్ దేవోరా మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందమైనా, బడ్జెట్ అయినా ప్రభుత్వం భారత్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ప్రధాని మొత్తం ఎంపీలకు వివరించారు. భారత్–అమెరికా, భారత్–యూరప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలకు ప్రధాని మోడీ దృఢసంకల్పమే కారణం. వీటి ద్వారా చిన్న వ్యాపారులకు పెద్ద లాభం చేకూరనుందని తెలిపారు. ప్రధాని మోడీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు పార్లమెంటరీ పనితీరు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత మార్గదర్శకాలు ఇచ్చారని కిరణ్ రిజిజు వెల్లడించారు. ఎన్నికలు గెలవాలంటే ప్రజల్లో ఉండాలి. నేల మీద పనిచేయకుండా విజయం సాధ్యం కాదు. ప్రజల సంక్షేమం కోసమే పని చేయాలని ప్రధాని స్పష్టం చేశారని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో నూతనంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్‌కు అధికారికంగా స్వాగతం పలికారు. బీజేపీతో పాటు టీడీపీ, జేడీయూ, ఎల్‌జేపీ (ఆర్), శివసేన, జేడీఎస్ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైనవారిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, అప్నా దళ్ నేత అనుప్రియా పటేల్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన నేత శ్రీకాంత్ షిండే, రాష్ట్రీయ లోక్ మోర్చా నేత ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఉన్నారు.
