
విజయవాడ వేదికగా ప్రారంభమైన ఆవకాయ్- అమరావతి సాంస్కృతిక ఉత్సవాలు
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆవకాయ్- ‘అమరావతి సాంస్కృతిక ఉత్సవం కృష్ణా నది తీరాన గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు నిర్వహించిన హారతి, కళాకారుల ప్రదర్శనలు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేది మన ఆతిథ్యం సంస్కృతులేనని ఉద్ఘాటించారు. తెలుగు వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటక రంగం కేవలం వినోదం మాత్రమే కాదు అది ఒక సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు (క్రియేటివ్ ఎకానమీ ) పునాది. అందుకే పర్యాటక రంగానికి ‘పరిశ్రమ’ హోదా కల్పించాం అని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో భారీ పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. మైసూర్, కోల్‌కతా దసరా ఉత్సవాలకు దీటుగా మన పండుగలు నేడు జాతీయ గుర్తింపు పొందుతున్నాయని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగకు ప్రవాసాంధ్రులు సొంతూళ్లకు వచ్చి కుటుంబాలతో కలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ మాట్లాడుతూ ఏపీలో కనిపిస్తున్న అభివృద్ధి చురుకుదనం యూరోపియన్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. "నాటు నాటు పాటకు మా దేశాల్లోనూ స్టెప్పులేస్తారు కూచిపూడికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది అని గుర్తుచేశారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, గ్రీన్ హైడ్రోజన్, అగ్రి-ఫుడ్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం త్వరలో జరగనున్న భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యాటకంతోనే పురోగతి: మంత్రి కందుల దుర్గేష్
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కృష్ణమ్మ ఒడిలో సాగుతున్న ఈ ఉత్సవాలు రాష్ట్రానికి కొత్త వెలుగులు వెలుగును పంచుతుందని మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో సాహిత్యం, కళలపై అనేక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో సంక్రాంతి ఉత్సవాల కారణంగా రాలేకపోయారని, ప్రజలంతా ఈ వేడుకలను ఆస్వాదించాలని కోరారు.
ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, రంగస్థల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాటి ‘భక్త ప్రహ్లాద’ నుంచి నేటి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వరకు తెలుగు సినిమా సాధించిన ప్రగతిపై ప్రత్యేక చర్చలు నిర్వహించారు. సాహిత్య సభలు, కవిత్వ పఠనాలు, డిజిటల్ ఆర్ట్స్‌పై అంతర్జాతీయ వర్క్‌షాప్‌లు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ హస్తకళల ప్రదర్శనలు సందర్శకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యేలు బొండా ఉమా, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
