
విజయవాడ వేదికగా ‘ఆవకాయ్’ సినిమా సంస్కృతి–సాహిత్యోత్సవం: కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుసంపన్నమైన కళా వైభవాన్ని, తెలుగు సినిమా మూలాలను సాహితీ సౌరభాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం ఒక వినూత్న సాంస్కృతిక వేదికను సిద్ధం చేసింది. విజయవాడలోని కృష్ణా నది తీరాన ఉన్న పున్నమి ఘాట్, భవాని ఐలాండ్ వేదికలుగా జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్‌వర్క్ ఆర్ట్స్ ప్రతినిధులతో కలిసి మంత్రి ఈ ఉత్సవ వివరాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆలోచనలకు అనుగుణంగా అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఉత్సవం కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా బహిరంగ ప్రదేశాల్లో సామాన్య ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకతని వివరించారు. గత ప్రభుత్వం కళలను, కళాకారులను పూర్తిగా విస్మరించిందని కూటమి ప్రభుత్వం కళా రంగానికి పునరుజ్జీవం పోయడమే కాకుండా నేటి తరం యువతకు మన కథా సంప్రదాయాలపై మక్కువ కలిగించేలా ఈ వేదికను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, ‘ఆవకాయ్’ ఉత్సవం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జనవరి మాసంలో ఈ ఉత్సవంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గండికోట, అరకు, విశాఖ, ఫ్లెమింగో ఉత్సవాలను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా మాట్లాడుతూ, సినిమా, సాహిత్యం,ప్రదర్శన కళల కలబోతగా సాగే ఈ కార్యక్రమం వైవిధ్యభరితమైన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని స్థానిక సంప్రదాయాలను పర్యాటకంతో అనుసంధానించడమే తమ లక్ష్యమని వివరించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో తెలుగు సినీ పరిశ్రమ పరిణామ క్రమం, సాహిత్యంపై లోతైన చర్చలతో పాటు కవిత్వం, ముషాయిరా, నృత్యం, సంగీతం, నాటక ప్రదర్శనలు ఉంటాయని ఆర్గనైజర్లు తెలిపారు. తోలుబొమ్మలాట వంటి ప్రాచీన కళలపై శిక్షణ తరగతులు, వారసత్వ యాత్రలు (హెరిటేజ్ వాక్), ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు స్థానిక రుచులతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ వారంలోనే ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆ తదనంతరం సినీ ప్రముఖులతో భేటీ అయ్యే తేదీలను ప్రకటిస్తామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.
