Let's talk: editor@tmv.in
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభం

Panthagani Anusha
11 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వైమానిక బంధం మరింత పటిష్టమైంది. విజయవాడ – హైదరాబాద్‌ నగరాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఎయిర్‌లైన్ సంస్థ ‘ఫ్లై91’ తన విమాన సర్వీసులను శుక్రవారం ఘనంగా ప్రారంభించింది. దీనివల్ల రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయాణ భారంతో పాటు సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొని ఈ సర్వీసులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యక్షంగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన తొలి విమాన ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

‘ఉడాన్‌’తో సామాన్యుడికి చేరువగా విమానం

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ ‘ఉడే దేశ్‌ కా ఆమ్ నాగరిక్’ (ఉడాన్‌) పథకం విజయవంతంగా అమలు కావడానికి ఫ్లై91 వంటి సంస్థల రాక నిదర్శనమని పేర్కొన్నారు. చిన్న నగరాలను మెట్రో నగరాలతో అనుసంధానించడమే ప్రధాన లక్ష్యమని దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా మరో 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన వివరించారు. భవిష్యత్తులో విజయవాడ నుంచి మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మెరుగైన విమాన కనెక్టివిటీ ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధికి వెన్నెముక వంటిదని కేవలం ప్రయాణికులకే కాకుండా కార్గో, లాజిస్టిక్స్‌ రంగాలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల ఎగుమతి వేగవంతం అవుతుందన్నారు. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మార్గంలో కొత్త ఎయిర్‌లైన్‌ ప్రారంభం కావడంతో పోటీ పెరిగి, విమాన టికెట్ల ధరలు సమతుల్యం అయ్యే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదనపు సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు తమ సమయానుకూలంగా వెళ్లే వెసులుబాటు కలిగింది. మొత్తానికి ఫ్లై91 రాకతో విజయవాడ – హైదరాబాద్‌ మధ్య ప్రయాణం మరింత సులభతరం వేగవంతం కానుంది.