
విజయవాడలో హాల్‌మార్క్ లేని రూ.3 కోట్ల బంగారం ఆభరణాలు సీజ్
మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుతో బంగారం కొంటాం. కానీ మనం కొనే ఆభరణం అసలైనదా? కాదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కాగా తాజాగా విజయవాడలో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం. గవర్నర్‌పేటలోని ఒక ప్రముఖ ఆభరణాల దుకాణంలో భారత స్టాండర్డ్స్ బ్యూరో (బిఐఎస్) అధికారులు భారీ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్‌మార్కింగ్ లేకుండా బంగారం విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఆదికారురులు తనిఖీ నిర్వహించారు. కాగా అధికారులు జరిపిన దాడులలో హాల్ మార్కింగ్ లేని సుమారు 2.2 కిలోల బరువున్న 233 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
కాగా స్వాధీనం చేసుకున్న ఆభరణాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇది బిఐఎస్ చట్టం 2016లోని నిబంధనలను నేరుగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించడం నేరమని, మొదటిసారి తప్పు చేసినా సరే ఏడాది జైలు శిక్ష లేదా కనీసం లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బంగారం స్వచ్ఛతకు హాల్‌మార్క్ ఒక గ్యారెంటీ అని, దీన్ని విస్మరించడం వల్ల వ్యాపారులు తాత్కాలిక లాభం పొందిన దీర్ఘకాలంలో భారీ ఆర్థిక నష్టాలతో పాటు ప్రతిష్టను కోల్పోతారని అధికారులు తెలిపారు. అదేవిధంగా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఆభరణాలు కొనే ముందు 'బిఐఎస్ కేర్ యాప్' ద్వారా హాల్‌మార్క్ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. నిబంధనల అమలులో రాజీ పడేది లేదని, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని బిఐఎస్ అధికారులు స్పష్టం చేశారు.
