
విజయవాడలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం: తృటిలో తప్పిన ప్రాణాపాయం
రాష్ట్రంలో వరుస బస్సు అగ్నిప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. వారం రోజుల క్రితమే 14 మందిని బలితీసుకున్న ఘోర ప్రమాదం మరువకముందే.. తాజాగా విజయవాడలో మరో ప్రైవేట్ ఏసీ బస్సు మంటల్లో చిక్కుకోవడం కలకలం రేపింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బ్యాటరీ వద్ద చెలరేగిన మంటలు
పోలీసుల కథనం ప్రకారం సోమవారం అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు విజయవాడ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో బస్సు వెనుక భాగంలోని బ్యాటరీ బాక్స్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది.
పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను దిగిపోవాలని సూచించాడు. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. బ్యాటరీ పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు-లారీ ఢీకొని 14 మంది సజీవదహనమైన ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం రవాణా శాఖ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ప్రైవేట్ బస్సుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు నామమాత్రంగానే ఉంటున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు.
