Let's talk: editor@tmv.in
విజయవాడలో కాంగ్రెస్–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. రాళ్ల దాడులతో ఉద్రిక్తత

విజయవాడలో కాంగ్రెస్–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. రాళ్ల దాడులతో ఉద్రిక్తత

Gaddamidi Naveen
23 జులై, 2026

ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన, దీనికి పోటీగా బీజేపీ నిర్వహించిన ప్రతి-నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పరస్పర ఆరోపణలతో విజయవాడ నగరంలో శాంతిభద్రతల సమస్య నెలకొంది.

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి. విజయవాడలో ఆంధ్రా రత్న భవన్ నుంచి లోక్ భవన్ వరకు మార్చ్ నిర్వహించి, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు ఏపీసీసీ ప్రణాళిక రూపొందించింది.

ఈ నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు స్థానికంగా దాడులను ఎదుర్కొన్నారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. గొడవ సృష్టిస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి బదులుగా, పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ కాలు విరగగా, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాచర్ల సూర్యప్రకాశ్, ఎన్ఎస్‌యూఐ నాయకుడు గోపి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఢిల్లీలో ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఆయన ఖండిస్తూ, కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇదిలా ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కాంగ్రెస్ శ్రేణులు రహదారి దిగ్బంధం (రాస్తారోకో) చేపట్టాయి. జిల్లా అధ్యక్షుడు కేఎస్ షానవాజ్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ఇప్పటివరకు దాదాపు 152 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, నీట్, యూపీఎస్సీ లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి వారి ఆత్మహత్యలకు కారణమయ్యాయని ఆరోపించారు. ప్రధాని మోడీ రాజీనామా చేసేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

బీజేపీ నిరసన - కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

మరోవైపు, కాంగ్రెస్ నిరసనను తిప్పికొడుతూ విజయవాడలోని విజయ టాకీస్ సెంటర్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించడం దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశవ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తోందని, ఢిల్లీలో సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో జరిగిన నిరసనల్లోకి అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహ శక్తులు ప్రవేశించాయని ఆరోపించారు.

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ, పార్లమెంట్ దాడి నిందితుడు అఫ్జల్ గురు ఉరిశిక్షను ప్రశ్నిస్తూ, దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసే శక్తులకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కొమ్ముకాస్తున్నాయని మాధవ్ విమర్శించారు. ప్రధానమంత్రి నివాసంపై దాడికి ప్రయత్నించడం అంటే దేశంపై దాడి చేయడమేనని, అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట బీజేపీ నిరసనలు తెలుపుతోందన్నారు. నీట్ పరీక్షలు పూర్తయి, ర్యాంకు కార్డులు విడుదల జరిగి, కౌన్సెలింగ్ ప్రక్రియ సాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ శవ రాజకీయాలు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు గుడ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారని, ఇది కాంగ్రెస్ హింసాత్మక రాజకీయాలకు నిదర్శనమని మాధవ్ ఆరోపించారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.