Let's talk: editor@tmv.in
విజయవంతమైన పింక్ రన్!

విజయవంతమైన పింక్ రన్!

FL - SUNL
29 సెప్టెంబర్, 2025

స్ట్రైడ్ అండ్ షైన్ నినాదంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ) ఫౌండేషన్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఆదివారం రొమ్ము క్యాన్స‌ర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పింక్ పవర్ మారథాన్ రన్ విజయవంతమైంది. చిన్నారుల నుంచి వృద్ధులు, వికలాంగుల వరకు వేల సంఖ్యలో ఈ రన్‌లో మేము సైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పింక్ పవర్ రన్‌లో పాల్గొనే వారి రాకతో నెక్లెస్ రోడ్ పరిసరాలు సందడి సందడిగా కనిపించాయి. పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు పింక్ రంగు టీ షర్ట్స్ ధరించటంతో ఈ ప్రాంతం అంతా గులాబీమ‌య‌మైంది. చుట్టూ పచ్చని మొక్కలు, చెట్లు, పూల మొక్కలు, నిండు కుండలా ఉన్న హుస్సేన్ సాగర్ అంచున జరిగిన రన్ చల్లటి వాతావరణంలో హైదరాబాద్ నగరంలో సుందర దృశ్యాన్ని ఆవిష్కరించింది.

పింక్ పవర్ రన్ నిర్వాహకులు ఎంఈఐఎల్, ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్లు సుధా రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, మిస్ వరల్డ్, వివిధ ఉపఖండాల సుందరీమణులు, ప్రపంచ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు జయేష్ రంజన్ , దాసరి హరిచందన, సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషితో పాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఈ రన్‌లో భాగస్వాముల‌య్యారు. తొలుత 10 కిలోమీటర్లు, అనంతరం ఐదు కిలోమీటర్లు, చివరగా మూడు కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. ప్రతి పరుగుకు ముందు అంతర్జాతీయ ఫిట్‌నెస్‌ నిపుణులు పరుగులో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచేలా మెళుకువలు నేర్పించారు. మిస్ వరల్డ్ 2025 ఒపెల్ సుచేత, మిస్ ఆసియా కృష్ణహ్ , సుధారెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి, జయేష్ రంజన్, తరుణ్ జోషి, లియాండర్ పేస్, దాసరి హరి చందన, మిస్ వరల్డ్ ఆర్గనైజషన్ చైర్ పర్సన్ జూలియా తదితరులు వివిధ కేటగిరీల పరుగు పందాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా హుస్సేన్ సాగర్ పక్కనే నెక్లెస్‌ రోడ్‌లో సాగింది. పది కిలోమీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ముగ్గురు మహిళలు, పురుషులకు ట్రోఫీలతో పాటు న‌గ‌దు బ‌హుమ‌తి అందించారు. అదే విధంగా ఐదు కిలోమీటర్ల పరుగును పూర్తి చేసిన వారికి కూడా ట్రోఫీలు, న‌గ‌దు బ‌హుమ‌తి అందించారు. పరుగులో పది కిలోమీటర్ల విభాగంలో పాల్గొన్న ఏడు సంవత్సరాల పార్వతి, ఐదు కిలోమీటర్ల విభాగంలో పాల్గొన్న ఐదు సంవత్సరాల కబీర్ సింగ్, వీల్ చైర్ తో పాల్గొన్న నంద కిషోర్ అనే యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. పరుగు ప్రారంభం సందర్భంగా పాల్గొన్న వారిని ఉత్సాహపరిచేందుకు వారిపై నిర్వాహకులు పూల వర్షం కురిపించారు.

అవగాహన మనంద‌రి బాధ్యత

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ రొమ్ము క్యాన్స‌ర్‌పై అవగాహన కల్గించేందుకు ఎస్ఆర్ ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ పరుగు నిర్వహించటం సంతోషకర‌మ‌ని, వారితో పాటు పరుగులో పాల్గొన్న వారిని అభినందించారు. రొమ్ము క్యాన్స‌ర్‌పై అవగాహన కల్పించ‌డం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి పురుషుడు తన కుటుంబంలోని మహిళలకు దీనిపై అవగాహన కల్పించటంతో పాటు పరీక్షలు చేయించాలని సూచించారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స చేయించుకుంటే నయ‌మ‌వుతుందన్నారు. హైద‌రాబాద్‌ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మాట్లాడుతూ పరుగుల రాజధానిగా మారిన హైదరాబాద్ లో రొమ్ము క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న‌ కోసం వివిధ విభాగాల్లో మారథాన్ నిర్వహించటం మంచి విష‌య‌మ‌న్నారు. ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఆలోచించి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ‌ చూపాలన్నారు. ప్రతి ఒక్కరు క్యాన్స‌ర్‌ పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేయించుకోవటం వల్ల న‌య‌మ‌వుతుంద‌న్నారు.

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ మాట్లాడుతూ కాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది పది వేల మంది, ఈ ఏడాది 20 వేల మంది పింక్ పవర్ రన్ లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఈ పరుగు ప్రతి ఒక్కరి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇటువంటి రన్ లు ఉపయోగపడతాయన్నారు. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే మంచి పనులు చేసి మంచి ఫలితాలు వస్తాయ‌న్నారు. మన దేశంలో ఇప్పటికీ క్యాన్స‌ర్‌పై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవటం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాధులపై అవగాహనకు పింక్ పవర్ రన్ లాంటివి ఎంతో ఉపయోగపడతాయి అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక నుంచి ప్రతి ఏటా

పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి మాట్లాడుతూ రొమ్ము క్యాన్స‌ర్‌పై అవగాహన కోసం నిర్వహించే ఈ పరుగును వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో గత ఏడాది నిర్వహించిన రన్ విజయవంతం కావటం తమను ఉత్సాహపరిచిందని తెలిపారు. తొలి విజయం రొమ్ము క్యాన్స‌ర్‌పై అవగాహనను మరింత ముందుకు వెళ్లేలా చేసిందన్నారు. ఆ స్ఫూర్తితోనే రెండో ఎడిషన్ విజయవంతంగా నిర్వహించామని, వచ్చే ఏడాది ఈ రన్ ను మరిన్ని ప్రాంతాలకు, దేశాలకు విస్తరిస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో తాము పింక్ పవర్ రన్ ప్రారంభించామన్నారు. ఆరోగ్యమైన ప్రపంచం ఆనందంగా ఉంటుందన్నారు. ఆనందమైన ప్రపంచం పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. తమ పరుగు వెనుక ప్రధానమైన స్ఫూర్తి ఇదేనన‌న్నారు. ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది హైదరాబాద్ రన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. వయసు తారతమ్యం లేకుండా పింక్ పవర్ రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కృష్ణారెడ్డి అభినందించారు. ఈ రన్ ను ప్రతి ఏడాది నిర్వహిస్తామన్నారు.

విజేతలు వీరే

10 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో అంకిత్ గుప్త ప్రథ‌మ, కమలాకర్ దేశముఖ్ ద్వితీయ, శుభం సింధు తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో సీమ, భారతి నైనా, సోనికా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వీరిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి మూడున్నర లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రెండున్నర లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి లక్షన్నర నగదు బహుమతి తో పాటు ట్రోఫీ అందజేశారు. ఐదు కిలోమీటర్ల మారథాన్ లో పురుషుల విభాగంలో హర్మోన్జోత్ సింగ్, సునీల్ కుమార్, సచిన్ యాదవ్, మహిళల విభాగంలో అంకిత, నీతా రాణి, అంకిత గవిట్ తొలి మూడు స్థానాలు సాధించారు. వీరికి ట్రోఫీ తో పాటు రెండున్నర లక్షలు, లక్షన్నర, లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు.

విజయవంతమైన పింక్ రన్! - Tholi Paluku