
విజయవంతమైన నేవీ మరథాన్ 10వ ఎడిషన్
తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విశాఖ నేవీ మారథాన్ – 2025 పదో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ మెగా ఈవెంట్ దేశవ్యాప్తంగానే కాకుండా, 17 విదేశీ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు, ఫిట్‌నెస్ ప్రేమికులతో సహా మొత్తం 17,000 మందికి పైగా రన్నర్లు పాల్గొనడంతో ఈసారి కొత్త రికార్డును సృష్టించింది. విశాఖ బీచ్ రోడ్డు వేదికగా ఉదయం నుంచే రన్నర్ల సందడితో తీరప్రాంతం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది.
విజేతలకు భారీ నగదు బహుమతి
ఈ మారథాన్‌లో హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగుల విభాగాల్లో విజేతలకు రూ.10 లక్షలకు పైగా బహుమతులు ప్రకటించగా, దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల నుంచి అథ్లెట్లు, ఫిట్‌నెస్ ప్రియులు విస్తృతంగా పాల్గొని ఈ ఏడాది ఈవెంట్‌కు కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించారు. క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు నేవీ కమాండ్ అందించిన ఈ భారీ బహుమతి మొత్తం రన్నర్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. 10 కే, 5 కే పరుగు పందాలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చి కలిసి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. వీరితో పాటు సీనియర్ నేవీ అధికారులు, నగరంలోని వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ మారథాన్ నిర్వహణలో జిల్లా యంత్రాంగం, సిటీ పోలీస్ విభాగం వాలంటీర్ల మధ్య అద్భుతమైన సమన్వయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి 2–3 కిలోమీటర్లకోసారి తాగునీరు, మెడికల్ టీమ్‌లు, పటిష్టమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రన్నర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
కాగా ఈ ఏడాది మారథాన్‌లో మెరుగైన రన్నింగ్ కిట్లు, ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రతి రన్నర్‌కు ఇన్సూరెన్స్ కవర్ వంటి అదనపు సౌకర్యాలను ప్రవేశపెట్టడం విశేషం. ఈ మెరుగైన ఏర్పాట్ల కారణంగా రన్నర్ కమ్యూనిటీ నుంచి ఈ ఈవెంట్‌కు భారీ స్పందన లభించింది.
అంతర్జాతీయ వేదికపై విశాఖ
17 విదేశీ దేశాల నుంచి రన్నర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల విశాఖ నేవీ మారథాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతున్న విషయం స్పష్టమైంది. అంతేకాక ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ మారథాన్‌ల జాబితాలో స్థానం సంపాదించి విశాఖ ఖ్యాతిని పెంచుతోంది అని మారథాన్ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈవెంట్ ముగింపు సందర్భంగా తూర్పు నౌకాదళ సీనియర్ అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్‌భల్లా మాట్లాడుతూ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి రన్నర్‌ను విజేతలను అభినందించారు. ఈవెంట్‌ను విజయవంతం చేసినందుకు జిల్లా యంత్రాంగం, సిటీ పోలీస్, వాలంటీర్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
