

విక్రమ్-1 విజయంతో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం.. స్కైరూట్‌కు రేవంత్, చంద్రబాబు అభినందనలు
భారత అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగానికి చెందిన 'విక్రమ్-1' ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం శనివారం ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఈ రాకెట్, శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 12:05 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన పోస్ట్‌కార్డులతో పాటు పలు సాంకేతిక ప్రదర్శన పేలోడ్‌లను ఇది భూగర్భ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 'మిషన్ ఆగమన్' పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం ప్రైవేట్ అంతరిక్ష మార్కెట్లో భారతదేశ సత్తాను చాటింది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా స్కైరూట్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌కు మరింత గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజయం పట్ల స్పందిస్తూ.. ఇది దేశానికి గర్వకారణమైన రోజని, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మరింత గర్వకారణమని కొనియాడారు. భారతదేశ అంతరిక్ష కలలకు తెలంగాణలోనే రూపకల్పన జరుగుతోంది. హైదరాబాద్ స్వంత సంస్థ అయిన స్కైరూట్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. దేశాన్ని భవిష్యత్తు వైపు నడిపించడంలో హైదరాబాద్‌లోని ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిరంతరం ముందంజలో ఉంటుందని ఈ విజయం నిరూపించిందని రేవంత్ రెడ్డి పేర్కొంటూ స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు.
గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తాను స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను సందర్శించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 'మిషన్ ఆగమన్' ప్రయోగ ప్రచారంలో భాగంగా విక్రమ్-1 రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి రవాణా చేసే కార్యక్రమాన్ని తానే స్వయంగా జెండా ఊపి ప్రారంభించానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ హబ్‌గా ఎదిగేందుకు తెలంగాణ వేస్తున్న అడుగులలో ఈ ప్రయోగ విజయం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
ఈ అద్భుతమైన విజయం ఏరోస్పేస్ ఆవిష్కరణలు, అధునాతన ఉత్పాదక రంగం, తదుపరి తరం అంతరిక్ష సాంకేతికతలకు భారతదేశంలోనే తెలంగాణను అగ్రగామి గమ్యస్థానంగా నిలబెట్టిందని సీఎం స్పష్టం చేశారు. ఈ రకమైన మైలురాళ్లు ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ నాయకుడిగా ఎదగాలనే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతను మరింత బలోపేతం చేస్తాయని, అలాగే సరికొత్త తరం ఆవిష్కర్తలకు, యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతరిక్ష రంగంలో సరికొత్త శకం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. విక్రమ్-1 కక్ష్యను విజయవంతంగా చేరుకోవడం ద్వారా అంతర్జాతీయ అత్యుత్తమ సంస్థల సరసన నిలిచేందుకు మన ప్రైవేట్ అంతరిక్ష రంగం సిద్ధంగా ఉందని నిరూపితమైందని అన్నారు. ఇదొక సరికొత్త శకానికి నాంది. మన శాస్త్ర సాంకేతిక సంస్థల బలం, భారతీయ పారిశ్రామికవేత్తల ప్రతిభాపాటవాలు కలిసికట్టుగా సరిహద్దులను దాటి ఆవిష్కరణలను సృష్టిస్తున్నాయి. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న స్కైరూట్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్ సంస్థలకు, వేలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక అభినందనలు అని చంద్రబాబు తెలిపారు. ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని, యువ ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
నాలుగు దశలతో, ఏడు అంతస్తుల ఎత్తు కలిగిన ఈ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయిందని స్కైరూట్ ఏరోస్పేస్ అధికారికంగా ప్రకటించింది.
