Let's talk: editor@tmv.in
వికసిత భారత్ సాధనకు 140 కోట్ల ప్రజల ఐక్యత అవసరం: ప్రధాని మోడీ
వికసిత భారత్ సాధనకు 140 కోట్ల ప్రజల ఐక్యత అవసరం: ప్రధాని మోడీ

వికసిత భారత్ సాధనకు 140 కోట్ల ప్రజల ఐక్యత అవసరం: ప్రధాని మోడీ

Pinjari Chand
29 మార్చి, 2026

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని 140 కోట్ల ప్రజలు ఐక్యంగా, అంకితభావంతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు సమిష్టి కృషి అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. శనివారం నోయిడా సమీపంలోని జేవర్‌లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ ప్రయోజనాల రక్షణతో పాటు కుటుంబాలు, రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని మనం ప్రశాంతంగా, సహనంతో, ఐక్యంగా ఎదుర్కోవాలి. ఇది ప్రపంచ సమస్య అయినప్పటికీ, భారత్ ప్రయోజనాలే మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. పశ్చిమాసియా ఘర్షణపై పార్లమెంట్‌లో చర్చించామని, రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా సానుకూలంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సూచించారు. భారత్‌కు అవసరమైన ముడి చమురు, గ్యాస్‌ కొంతమేరకు ఘర్షణ ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తాయని పేర్కొన్న మోడీ, ఆ ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వికసిత ఉత్తరప్రదేశ్, వికసిత భారత్ ప్రయాణంలో కొత్త అధ్యాయంగా ఆయన అభివర్ణించారు., ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, యువతకు ఇది కొత్త అవకాశాలు తెస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది

ప్రభుత్వ విమానయాన విధానాన్ని ప్రస్తావిస్తూ, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ‘ఉడాన్’ పథకం అమలు చేశామని మోడీ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.6 కోట్లకు పైగా ప్రయాణికులు తక్కువ ధరల్లో ప్రయాణించారని చెప్పారు. ఈ పథకాన్ని రూ.29,000 కోట్ల వ్యయంతో మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. విమానాల నిర్వహణ, సేవల కోసం భారీగా నిపుణుల అవసరం ఏర్పడుతుందని, యువతకు ఇది గొప్ప అవకాశం అని అన్నారు.

ఇంతకు ముందు భారతదేశంలో విమానాల మరమ్మతుల (ఎంఆర్‌‌వో) సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల 85 శాతం విమానాలు విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు దేశంలోనే పెద్ద ఎత్తున ఎంఆర్‌‌వో కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జేవర్‌లో కూడా ఒక కేంద్రం ప్రారంభించామని చెప్పారు. దేశంలో ఆధునిక రవాణా వ్యవస్థలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మెట్రో, వందే భారత్, నమో భారత్ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు ప్రజలకు సౌలభ్యం పెరిగిందని అన్నారు. ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు ద్వారా ఇప్పటికే 2.5 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు.

గత 11 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టిందని, రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణానికి రూ.17 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. లక్ష కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మించామని వివరించారు. సుమారు రూ.11,200 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 1.2 కోట్ల ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండగా, భవిష్యత్తులో 7 కోట్లకు పెంచే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. కార్గో హబ్ ద్వారా ప్రారంభంలో సంవత్సరానికి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యం ఉండగా, దాన్ని 18 లక్షల టన్నుల వరకు విస్తరించనున్నారు. రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానం కలిగిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందనుంది. ప్రధాని మోడీ విమానాశ్రయ టెర్మినల్‌ను కూడా పరిశీలించారు.