Let's talk: editor@tmv.in
"వికసిత భారత్ నిర్మాణంలో ఆత్మవిశ్వాసమే అసలైన శక్తి": మోడీ

"వికసిత భారత్ నిర్మాణంలో ఆత్మవిశ్వాసమే అసలైన శక్తి": మోడీ

Dantu Vijaya Lakshmi Prasanna
4 ఫిబ్రవరి, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 3, 2026 నాడు సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఒక ఆసక్తికర శ్లోకాన్ని పంచుకున్నారు. అమెరికా-భారత్ మధ్య జరిగిన కీలకమైన వాణిజ్య ఒప్పందం అనంతరం, దేశంలో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని పురస్కరించుకుని ఆయన ఈ పోస్ట్ చేశారు. భారతీయ ఉత్పత్తులపై సుంకాలు భారీగా తగ్గిన నేపథ్యంలో, దేశీయ పారిశ్రామికవేత్తల్లో, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి, "ఆత్మవిశ్వాసమే అన్ని విజయాలకు మూలమని" ఆయన ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న సంస్కృత శ్లోకం ద్వారా సంపద, విజయం ఎలా లభిస్తాయో వివరించారు. కేవలం అవకాశాలు ఉంటే సరిపోదని, శుభప్రదమైన పనులు, సాహసోపేతమైన నిర్ణయాలు, పనిలో నైపుణ్యం, క్రమశిక్షణ ఉన్నప్పుడే అభివృద్ధి సుస్థిరమవుతుందని ఆయన సందేశం ఇచ్చారు. 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి భారతీయుడు తనపై తాను నమ్మకం ఉంచి, దక్షతతో ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భం ద్వారా పిలుపునిచ్చారు.

సంస్కృత శ్లోకం

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।

दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥

శ్రీర్మంగళాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సంప్రవర్ధతే

దాక్ష్యాత్ తు కురుతే మూలం సంయమాత్ ప్రతితిష్ఠతి ||

సిరిసంపదలు (లక్ష్మి) ఈ క్రింది విధంగా ప్రాప్తిస్తాయి

మంగళాత్ ప్రభవతి:

శుభప్రదమైన పనుల ద్వారా లక్ష్మి ఉద్భవిస్తుంది.

ప్రాగల్భ్యాత్ సంప్రవర్ధతే:

ధైర్యం మరియు సామర్థ్యం వల్ల అది వృద్ధి చెందుతుంది.

దాక్ష్యాత్ తు కురుతే మూలం:

పనిలో నేర్పు (చాకచక్యం) వల్ల అది సుస్థిరమవుతుంది.

సంయమాత్ ప్రతితిష్ఠతి:

ఇంద్రియ నిగ్రహం మరియు క్రమశిక్షణ పాటించడం ద్వారా అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

"ఆత్మవిశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి, దీని ఆధారంగా ఏదైనా సాధ్యమే. వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్) కలను సాకారం చేయడంలో దేశప్రజల ఈ శక్తే ఎంతో ఉపయోగపడనుంది" అంటూ ముగించారు.