
'వికసిత్ భారత్' సంకల్పాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక బడ్జెట్: ఎన్. రామచందర్‌రావు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ 'ఆత్మనిర్భర్ భారత్ 'వికసిత్ భారత్' అనేవి కేవలం నినాదాలు కావని, మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని కొనియాడారు.
ఇది భవిష్యత్ దృష్టితో రూపొందించిన బడ్జెట్ అని, దేశంలోని ప్రతి రంగాన్ని బలోపేతం చేయడానికి, ప్రతి వర్గాన్ని ముందుకు నడిపించడానికి, ప్రతి పౌరుడిలోని సామర్థ్యాన్ని వెలికితీయడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందిస్తోందన్నారు. ఈ బడ్జెట్ ఆశయాల్లో ధైర్యమైన లక్ష్యాలు, వాటిని సాధించేందుకు ఆచరణాత్మక మార్గాలు సమన్వయమై ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి ప్రతి దశలో స్థిరమైన మద్దతు అందించేలా బడ్జెట్‌ను రూపొందించడం విశేషమని ఆయన తెలిపారు. ‘వికసిత్ భారత్ బడ్జెట్’ ప్రపంచ ధోరణులను అనుసరించే భారత్‌ను కాదు, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే భారత్‌ను ఆవిష్కరిస్తోందన్నారు.
తయారీ రంగం, మౌలిక వసతులు, ఆరోగ్యం, పర్యాటకం నుంచి గ్రామీణాభివృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలు, క్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల వరకు దేశ ప్రగతిని నిర్ణయించే ప్రతి రంగాన్ని ఈ బడ్జెట్ స్పృశించిందన్నారు. ముఖ్యంగా యువత ఆశయాలకు బలమిచ్చే విధంగా, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించేలా, దేశానికి వెన్నెముకైన రైతులను బలోపేతం చేసేలా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందన్నారు.
తెలంగాణకు ‘హై-స్పీడ్’ గుర్తింపు
ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరంలోని ప్రజల కలలను సాధ్యమైన లక్ష్యాలుగా మార్చే శక్తి ఈ బడ్జెట్‌లో ఉందని రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్‌కు హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం తెలంగాణ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవమని ఆయన అన్నారు. ఆర్థికంగా తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తి, ఉపాధి కల్పన, వ్యవసాయం, మౌలిక వసతులకు పెద్దపీట వేసిన ఈ బడ్జెట్ నిజంగా చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. ‘అంత్యోదయం నుంచి అభ్యుదయం’ వైపు సాగుతున్న ఈ ప్రయాణం భారత్‌ను ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ, రాబోయే 25 ఏళ్ల జాతీయ నిర్మాణానికి పటిష్టమైన పునాది వేసిన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
