
వికసిత్ భారత్ యువత చేతుల్లో:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ (హైదరాబాద్ చాప్టర్) నైపుణ్య శిక్షణ కేంద్రం దేశ భవిష్యత్తుకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఇక్కడ వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతున్న యువతలో కనిపించిన అపారమైన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలివచ్చి, నైపుణ్యాలను నేర్చుకుంటున్న శిక్షణార్థులతో ముచ్చటించడం గొప్ప అనుభూతినిచ్చిందని ఆయన తెలిపారు. యువత తమ జీవితాలను మార్చుకునేందుకు, నవభారత నిర్మాణంలో పాలుపంచుకునేందుకు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయం. అన్నారు.
ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న యువతలో దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, వారిలో కనిపించిన జాతీయ స్ఫూర్తి అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ యువతకు సరైన నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించగలిగితే వారు తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించగలిగే చోదకశక్తులుగా వికసిస్తారనే దృఢమైన విశ్వాసం వ్యక్తపరిచారు.ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి కల్పించేందుకు, వారిని స్వశక్తితో నిలబడేలా చేసేందుకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
యువశక్తికి సరైన మార్గదర్శకత్వం, మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే దేశం వేగంగా ప్రగతి సాధించగలదని, ఈ క్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి సంస్థల పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యంపై ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
