Let's talk: editor@tmv.in
విండీస్‌తో రెండో టెస్టు: జైస్వాల్ అరుదైన రికార్డు

విండీస్‌తో రెండో టెస్టు: జైస్వాల్ అరుదైన రికార్డు

Shaik Mohammad Shaffee
11 అక్టోబర్, 2025

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‎తో జరుగుతున్న రెండో టెస్టులో భారీ సెంచరీ చేసిన భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. జైస్వాల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ శుక్రవారం రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్‌లలో కలిపి) 3,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు.

కేవలం 50 మ్యాచ్‌లలో జైస్వాల్ 3,156 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 17 అర్థ సెంచరీలు ఉన్నాయి. తొలి రోజు ఆటలోనే జైస్వాల్ తన ఏడో టెస్ట్ సెంచరీని నమోదు చేసి, స్టంప్స్ సమయానికి 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జైస్వాల్ సాధించిన ఏడు టెస్ట్ సెంచరీలలో ఐదు 150+ స్కోర్లే కావడం విశేషం. 23 ఏళ్లు నిండకముందే ఇంతకంటే ఎక్కువ 150+ స్కోర్లు (8) సాధించిన ఏకైక ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్‌ మాత్రమే. ఆయన తర్వాత 5 సార్లు 150 స్కోర్ చేసి జైశ్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు.

23 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్, అంతర్జాతీయ క్రికెట్‌లో 8,696 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 5,052 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. యువరాజ్ సింగ్ 3,853 పరుగులు, సురేష్ రైనా 3,350 పరుగులు, రవిశాస్త్రి 3,224 పరుగులు చేసి యశస్వి జైస్వాల్ కంటే ముందున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీతో మెరవగా.. సాయి సుదర్శన్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో మరోసారి విండీస్‌ బౌలర్లు విఫలమయ్యారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు యువ ఓపెనర్‌ జైస్వాల్‌ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్.. ద్విశతకం (173 నాటౌట్) దిశగా సాగుతున్నాడు. కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 54 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, వారికన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి సాయి సుదర్శన్ వచ్చాడు. కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో ఇబ్బందులు పడుతున్న సుదర్శన్‌ ఈసారి పరుగుల బాట పట్టాడు.

యశస్వి, సాయి సుదర్శన్ కలిసి రెండో వికెట్‌కి 193 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 165 బంతుల్లో 12 ఫోర్లతో 87 పరుగులు చేసిన సాయి సుదర్శన్, సెంచరీకి ముందు వారికన్‌ బౌలింగ్‌లోనే ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌ (173), గిల్‌ (20) ఉన్నారు. గిల్‌ కూడా రాణిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ స్కోరు ఖాయమే.