
విండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విండీస్ జట్టును 140 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. భారత వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అజేయ శతకం (104 పరుగులు నాటౌట్), బౌలింగ్‌లో నాలుగు వికెట్లు (4/54) తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
బ్యాటింగ్‌లో మెరుపులు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ను భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్, బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (100), యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో చెలరేగారు. శుభ్‌మన్ గిల్ (50) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, వెస్టిండీస్‌పై 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ, భారత స్పిన్నర్లు, పేసర్ల దాటికి ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. మూడో రోజు లంచ్ సమయానికే 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజే (38), జస్టిన్ గ్రీవ్స్ (25) మాత్రమే కాస్త పోరాడగలిగారు.
జడేజా స్పిన్ మాయాజాలం
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో అద్భుతం చేసిన జడేజా, బంతితో కూడా మాయ చేశాడు. కీలకమైన జాన్ కాంప్‌బెల్, బ్రాండన్ కింగ్, షై హోప్, జోహన్ లేన్‌ల వికెట్లను పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. కేవలం 13 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన తీశాడు. జడేజాకు తోడుగా మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. దీంతో వెస్టిండీస్ జట్టు 45.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా 140 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయం భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ బలాన్ని, ముఖ్యంగా దేశవాళీ పరిస్థితుల్లో వారి తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. తొలి టెస్ట్‌లోనే సెంచరీలతో పాటు కీలకమైన వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, ఈ టెస్ట్ ఫార్మాట్‌లో తన స్థానం ఎంత పటిష్టమో నిరూపించాడు. తదుపరి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుండి న్యూఢిల్లీలో జరగనుంది.
