
వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు
మిలన్ కోర్టినా 2026 వింటర్ ఒలింపిక్ క్రీడల్లో భారత అగ్రశ్రేణి ఆల్పైన్ స్కీయర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. సోమవారం జరిగిన పురుషుల 'స్లాలమ్' విభాగంలో ఆరిఫ్ 39వ స్థానంలో నిలిచి, వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో ఈ విభాగంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారతీయ పురుష క్రీడాకారుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇటలీలోని స్టెల్వియో స్కీ సెంటర్‌లో జరిగిన ఈ పోటీలో ఆరిఫ్ రెండు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి, మొత్తంగా 2 నిమిషాల 41.60 సెకన్ల సమయాన్ని నమోదు చేశాడు.
38 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ విజయంతో ఆరిఫ్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటి రికార్డును తిరగరాశాడు. అంతకుముందు 1988 కల్గరీ వింటర్ ఒలింపిక్స్‌లో కిషోర్ రత్న రాయ్ 49వ స్థానంలో నిలవడమే ఇప్పటివరకు పురుషుల విభాగంలో అత్యుత్తమంగా ఉండేది. కాగా, భారత్ తరపున వింటర్ గేమ్స్‌లో ఓవరాల్‌గా అత్యుత్తమ ర్యాంకు మాత్రం శైలజ కుమార్ (1988లో మహిళల విభాగంలో 28వ స్థానం) పేరిట ఉంది. 35 ఏళ్ల ఆరిఫ్ ఖాన్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా, గత బీజింగ్ (2022) ఒలింపిక్స్‌లో జెయింట్ స్లాలమ్‌లో 45వ స్థానంలో నిలిచి అప్పట్లోనూ రికార్డు సృష్టించాడు.
మంచు తుపానును తట్టుకొని..
ఈసారి పోటీలు అత్యంత కఠినమైన వాతావరణంలో జరిగాయి. మొదటి రౌండ్ సమయంలో విపరీతమైన మంచు తుపాను కురవడంతో ట్రాక్ పట్టు దొరకడం కష్టమైంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆరిఫ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 1:22.12 సెకన్లతో 44వ స్థానంలో నిలిచాడు. ఎంత కఠినమైన పరిస్థితి అంటే.. రేసును ప్రారంభించిన 96 మందిలో 50 మంది మధ్యలోనే నిష్క్రమించగా (డీఎన్ఎఫ్), కేవలం 44 మంది మాత్రమే రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. జెయింట్ స్లాలమ్ స్వర్ణ విజేత లూకాస్ బ్రాథెన్ కూడా ఈ దశలో వెనుతిరగడం గమనార్హం.
రెండో రౌండ్‌లో మెరుపు వేగం
రెండో రౌండ్ సమయానికి ఆకాశం క్లియర్ కావడంతో ఆరిఫ్ మరింత వేగంగా స్కీయింగ్ చేశాడు. ఈ రౌండ్‌ను కేవలం 1:19.48 సెకన్లలోనే పూర్తి చేసి ఓవరాల్‌గా 39వ స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన లోయిక్ మెయిలార్డ్ (1:53.61) స్వర్ణ పతకాన్ని సాధించగా, ఆస్ట్రియాకు చెందిన ఫాబియో రజతం, నార్వేకు చెందిన హెన్రిక్ కాంస్యం గెలుచుకున్నారు. ఆశ్చర్యకరంగా గత ఒలింపిక్స్ స్వర్ణ విజేత క్లెమెంట్ నోయెల్ (ఫ్రాన్స్) రెండో రౌండ్‌లో విఫలమై రేసు నుంచి తప్పుకున్నాడు.
ముగిసిన భారత పోరాటం
ఆరిఫ్ ఖాన్ పోటీతో ఈ వింటర్ ఒలింపిక్స్‌లో భారత పోరాటం ముగిసింది. అంతకుముందు జరిగిన పురుషుల 10 కిలోమీటర్ల ఫ్రీస్టైల్ క్రాస్ కంట్రీ స్కీయింగ్ పోటీలో భారత్‌కు చెందిన స్టాంజిన్ లుండప్ 104వ స్థానంలో నిలిచాడు. అత్యంత వేగంగా, జిగ్‌జాగ్ పద్ధతిలో పోల్స్‌ను దాటుకుంటూ వెళ్లాల్సిన స్లాలమ్ విభాగంలో ఆరిఫ్ చూపిన పట్టుదల, ఏకాగ్రతను క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
