
వాహనదారులకు హెచ్చరిక: టోల్ బకాయిలు ఉంటే వాహనాల బదిలీ, ఫిట్‌నెస్ రెన్యూవల్ కష్టమే!
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఇకపై టోల్ ఫీజు చెల్లింపు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. టోల్ ప్లాజాల వద్ద ఫీజులు చెల్లించకుండా తప్పించుకునే వారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-2026'కు సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, టోల్ ఫీజు బకాయిలు ఉంటే వాహనాలకు సంబంధించిన ముఖ్యమైన పనులు నిలిచిపోనున్నాయి.
బకాయి ఉంటే ఏయే పనులు ఆగుతాయి?
కొత్త నిబంధనల ప్రకారం, మీ వాహనానికి సంబంధించిన టోల్ బకాయిలు ఉంటే కొన్ని కీలక సేవలు పొందడం సాధ్యం కాదు. వాహనాన్ని ఇతర వ్యక్తికి అమ్మడం లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మార్చేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) టోల్ బకాయిలు చెల్లించకపోతే జారీ చేయరు. అలాగే వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడం లేదా దాన్ని పునరుద్ధరించుకోవడం (రిన్యూవల్) కూడా బకాయిలు ఉన్నంత వరకు అనుమతించరు. అంతేకాకుండా, లారీలు, ట్రావెల్స్ వంటి కమర్షియల్ వాహనాలు జాతీయ పర్మిట్ పొందాలంటే వాటిపై ఎలాంటి టోల్ బకాయిలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
'అన్‌పెయిడ్ యూజర్ ఫీ' అంటే ఏమిటి?
సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో (ఫాస్టాగ్ వంటివి) వాహనం వెళ్లినట్లు రికార్డు అయి, సాంకేతిక కారణాల వల్ల లేదా ఖాతాలో డబ్బులు లేక ఫీజు జమ కాకపోతే దానిని 'అన్‌పెయిడ్ యూజర్ ఫీ' (చెల్లించని రుసుము)గా పరిగణిస్తారు. ఈ వివరాలన్నీ ఇప్పుడు నేరుగా వాహన రిజిస్ట్రేషన్ పోర్టల్‌తో అనుసంధానం చేయబడతాయి. వాహన యజమానులు ఇకపై 'ఫామ్ 28' (ఎన్‌ఓసీ దరఖాస్తు) నింపే సమయంలో తమ వాహనంపై ఎలాంటి టోల్ బాకీలు లేవని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది.
సాంకేతిక విప్లవం దిశగా అడుగులు
ప్రభుత్వం త్వరలో 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' (ఎంఎల్ఎఫ్ఎఫ్) అనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద బారికేడ్లు ఉండవు, వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ వసూలు అవుతుంది. అటువంటి సమయంలో ఎవరైనా ఫీజు చెల్లించకుండా వెళ్తే, వారిని పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకే అటువంటి బాకీలను వాహన ఫిట్‌నెస్, అమ్మకాలతో ముడిపెట్టడం ద్వారా వసూళ్లను పక్కాగా చేయాలని ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.
ఈ నిబంధనల వల్ల జాతీయ రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులు సక్రమంగా వసూలు అవుతాయని, టోల్ వసూళ్లలో పారదర్శకత పెరుగుతుందని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) భావిస్తోంది. గత ఏడాది జూలైలో ఈ నిబంధనలపై ప్రజల నుండి సలహాలు స్వీకరించిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని అధికారికంగా ఖరారు చేసింది. కాబట్టి వాహనదారులు తమ ఫాస్టాగ్ వాలెట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం, పాత బాకీలు ఏవైనా ఉంటే వెంటనే చెల్లించుకోవడం ఉత్తమం.
