
వాస్తవాలు తెలియకుండా జోక్యం చేసుకోవద్దు: కేరళ సీఎంపై డీకే శివకుమార్
బెంగళూరులో ఇటీవల చేపట్టిన కూల్చివేత చర్యలపై విమర్శలు చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం ఘాటుగా స్పందించారు. స్థల పరిస్థితులు, వాస్తవాలు పూర్తిగా తెలియకుండా సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.
బెంగళూరులో డీకే మీడియాతో మాట్లాడుతూ, విజయన్ వ్యాఖ్యలను శివకుమార్ దురదృష్టకరంగా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల నాయకులు రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి ముందు బెంగళూరులోని వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కూల్చివేతలు ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టినవి కాదని, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కూల్చివేతలు జరిగిన ప్రాంతం అక్రమంగా ఆక్రమించబడిన చెత్త డంప్‌సైట్ అని, దాన్ని స్లమ్‌గా మార్చేందుకు భూ మాఫియా ప్రయత్నాలు చేస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. మాకు మానవత్వం ఉంది. ప్రజలకు ఇతర ప్రాంతాలకు మారేందుకు అవకాశం ఇచ్చాం. అక్కడ ఉన్నవారిలో కొద్ది మందే స్థానికులని ఆయన తెలిపారు. మేం బుల్డోజర్ రాజకీయాలు చేయడం లేదు. ప్రభుత్వ భూమి, ప్రజా ఆస్తులను కాపాడే ప్రయత్నమే చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ అంశంపై పూర్తి సమాచారం లేకుండా వ్యాఖ్యలు చేయొద్దని కేరళ ముఖ్యమంత్రిని ఆయన నేరుగా కోరారు. పినరయి విజయన్ వంటి సీనియర్ నాయకులు బెంగళూరులోని సమస్యలను అర్థం చేసుకోవాలి. మా నగరాన్ని ఏవిధంగా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. భూ మాఫియాను ప్రోత్సహించే స్లమ్‌లను మేము అనుమతించం అని శివకుమార్ స్పష్టం చేశారు.
ఫకీర్ కాలనీ, వసీం లేఅవుట్‌లలో జరిగిన కూల్చివేతలను కేరళ సీఎం విజయన్ ఫేస్‌బుక్ పోస్టులో తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాల్లో ముస్లింలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారని పేర్కొన్న విజయన్, ఈ చర్యలను అత్యంత షాకింగ్, బాధాకరంగా అభివర్ణించారు. కర్ణాటక ప్రభుత్వం ఉత్తర భారత బుల్డోజర్ న్యాయం మోడల్‌ను అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు.
పేదలకు ఆశ్రయం కల్పించకుండా బలవంతంగా తరలించడాన్ని ఎలా సమర్థించగలదని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వాన్ని విజయన్ ప్రశ్నించారు. మైనారిటీలకు వ్యతిరేకమైన దూకుడు రాజకీయాల ప్రతిబింబంగా ఈ కూల్చివేతలు కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
