
వాల్మీకుల ఉద్యమానికి మొదటి మద్దతు మాదే
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మొదలైన ఉద్యమానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమేనని ధర్మవరం టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో శ్రీరామ్ పాల్గొన్నారు. ఎర్రగుంట సర్కిల్ వద్ద వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో.. భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని వాల్మీకి విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షిని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని దశాబ్ధాలుగా పోరాటం సాగుతోందన్నారు. ఈ పోరాటానికి మొదటి మద్దతు పరిటాల కుటుంబం నుంచే వచ్చిందన్నారు. వాల్మీకి రిజర్వేషన్ అంశంలో తీవ్ర ఆలస్యం జరిగిందనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మినారాయణతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు వాల్మికి రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నారని పరిటాల శ్రీరామ్ గుర్తుచేశారు. అసెంబ్లీలో కూడా ఇటీవల దీని గురించి ప్రస్తావించారన్నారు. పార్లమెంటులో కూడా దీనిపై పోరాటం చేస్తున్నారన్నారు. త్వరలోనే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న కల నెరవేరుతుందని పరిటాల శ్రీరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
