Let's talk: editor@tmv.in
వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: శశిథరూర్

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: శశిథరూర్

Pinjari Chand
4 నవంబర్, 2025

కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టారు. అన్ని పార్టీల్లో ఉన్న వారసత్వపు నాయకులపై విమర్శలు గుప్పించినప్పటికీ ఎక్కువగా గాంధీ కుటుంబానికే నష్టం జరిగేలా ఉంది. దేశ రాజకీయాల్లో పెరుగుతున్న వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. నాయకత్వం జన్మ హక్కు కాదు. అర్హత, కృషి, ప్రజా సేవలే ప్రమాణాలుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

శశిథరూర్ ప్రాజెక్ట్‌ సిండికేట్‌ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ‘ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఏ ఫ్యామిలీ బిజినెస్’ అనే వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాసం అక్టోబర్ 31న ప్రచురితమైంది. ఆ వ్యాసం ద్వారా ఆయన కాంగ్రెస్‌ సహా దాదాపు అన్ని పార్టీల్లోని వారసత్వ ధోరణిపై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, ఇప్పటి రాహుల్‌, ప్రియాంక గాంధీ వరకూ ఒకే కుటుంబం భారత రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది.దీంతో నాయకత్వం జన్మ హక్కు అన్న భావన దేశంలో బలపడిందని థరూర్‌ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. నెహ్రూ–గాంధీ కుటుంబం స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించినా, క్రమంగా ఆ కుటుంబ ఆధిపత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలో అర్హత ఆధారిత నాయకత్వానికి ఆటంకంగామారిందన్నారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకూ, భారత రాజకీయ వ్యవస్థలో కుటుంబ వారసత్వం బలంగా నాటుకుపోయిందన్నారు. ఎన్నికల్లో గెలుపు, పదవులు అన్నీ వారసత్వంగా మారిపోయాయని ఆయన విమర్శించారు.

అన్ని పార్టీలపైనా శశిథరూర్‌ వ్యాఖ్యలు

ఈ వ్యాసం కేవలం కాంగ్రెస్‌పైనే కాకుండా ఇండియా కూటమిలో ఉన్న దాని మిత్రపక్షాలను కూడా దెబ్బ కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌ తరువాత ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడయ్యారు. మహారాష్ట్రలో బాల్‌ ఠాక్రే తరువాత ఆయన కుమారుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఇప్పుడు మనవడు ఆదిత్య ఠాక్రే వారసత్వానికి సిద్ధమవుతున్నారు. బీహార్‌లో రామ్‌విలాస్‌ పాశ్వాన్ తరువాత ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్ బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబం మూడు తరాలుగా అధికారంలో ఉంది. తమిళనాడులో కరుణానిధి కుటుంబం డీఎంకే పార్టీని పూర్తిగా నియంత్రిస్తోంది. ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్‌ ఆయన కుమారుడు, ఇప్పుడు మనవడు ఉదయనిధి స్టాలిన్ వారసుడిగా ఎదుగుతున్నారని, తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్, ఏపీలో చంద్రబాబు కుమారుడు లోకేశ్, పంజాబ్ లో బాదల్ కుటుంబం రాజకీయాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక పరిశోధన ప్రకారం, దేశవ్యాప్తంగా 149 కుటుంబాలు రాష్ట్ర అసెంబ్లీల్లో బహుళ సభ్యులతో ప్రాతినిధ్యం వహిస్తున్నాయని థరూర్‌ వెల్లడించారు. కేంద్ర మంత్రులలో 11 మంది, ముఖ్యమంత్రులలో 9 మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారేనని చెప్పారు.2009 ఎన్నికల అధ్యయనంలో 45 ఏళ్ల లోపు ఎంపీలలో రెండు,మూడొంతుల మందికి రాజకీయ వారసత్వం ఉందని తెలిపారు.మహిళా ఎంపీలలో 70 శాతం మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారేనని వివరించారు.

ఎన్డీయేలోనూ వారసత్వం

వారసత్వ రాజకీయాలు కేవలం కాంగ్రెస్‌ లేదా ఇండియా బ్లాక్‌లో మాత్రమే లేదని. ఎన్డీయేలో కూడా ఉన్నాయని థరూర్‌ వివరించారు. బిజు పట్నాయక్‌ మరణం తరువాత ఆయన కుమారుడు నవీన్‌ పట్నాయక్‌ ఒడిశాలో రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగారు. లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్ స్థానంలో కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్ బాధ్యతలు చేపట్టారని ఉదాహరణలు ఇచ్చారు.

వ్యవస్థ అంతా ముందే సిద్ధం

వారసత్వ కుటుంబాల వద్ద పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులు, పార్టీ యంత్రాంగం, దాతల నెట్‌వర్క్‌, అనుచరుల వ్యవస్థ ముందే సిద్ధంగా ఉంటుంది. దీంతో కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కష్టమవుతోందని థరూర్‌ విమర్శించారు. అయన అభిప్రాయం ప్రకారం, రాజకీయాల్లో అర్హత, ప్రజా అనుభవం, కృషి కంటే కుటుంబం పేరు ప్రాముఖ్యం పొందడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని వాపోయారు.

అర్హతగా ‘సర్‌నేమ్‌’

ఎన్ని ఎన్నికల్లో పరాజయాలు ఎదురైనా, కుటుంబ వారసులు పార్టీలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. పాలనలో పనితీరు ఎలా ఉన్నా, వారసత్వం ఆధారంగా పదవులు లభిస్తున్నాయి. సర్‌నేమ్‌నే అర్హతగా పరిగణించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని ఆయన వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యం తన అసలు ఆత్మ అయిన ‘ప్రజలచే, ప్రజల కోసం, ప్రజల పాలనను సాధించాలంటే వారసత్వ రాజకీయాల నుంచి బయటపడాల్సిందే అని స్పష్టం చేశారు.

సంస్కరణలు తీసుకురావాలి

• పార్టీల్లో అంతర్గత ఎన్నికలు తప్పనిసరి చేయాలి.

• నాయకత్వానికి పదవీ కాల పరిమితులు ఉండాలి.

• ఓటర్లలో మెరిట్‌ ఆధారంగా ఓటు వేసే చైతన్యం పెంచాలి

బీజేపీకి ఆయుధం

థరూర్‌ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఎక్స్‌ లో కుటుంబ వారసత్వంపై పోస్ట్​ చేశారు. థరూర్‌ రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌లాంటి ‘నెపో కిడ్స్‌’పై నేరుగా దాడి చేశారు. ఇదే కారణంగా నామ్‌దార్‌లు మా కామ్‌దార్‌ చాయ్‌వాలా మోడీపై అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను థరూర్‌ విమర్శించడంతో అప్పుడే ఆయనపై కాంగ్రెస్‌లో విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాసం కారణంగా ఆయన మళ్లీ ఇబ్బందుల్లో పడతారేమో చూడాలి అని పేర్కొన్నారు.

థరూర్‌ గతంలో మోడీపై చేసిన వ్యాఖ్యలు

మోడీ శక్తి, చురుకుదనం, అంతర్జాతీయ వేదికలపై ఆయన చొరవ భారతదేశానికి ఆస్తి అని వ్యాఖ్యానించినప్పుడు కాంగ్రెస్‌లో పెద్ద చర్చ జరిగింది.

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: శశిథరూర్ - Tholi Paluku