Let's talk: editor@tmv.in
వారంలోగా జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు: ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ప్రియాంక ఆదేశం

వారంలోగా జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు: ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ప్రియాంక ఆదేశం

Gaddamidi Naveen
21 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక జిల్లా పౌర సంబంధాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీలో నిర్వహించిన శిక్షణ వర్క్‌షాప్‌లో ఆమె ప్రసంగించారు.

జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని, వారం రోజుల్లోగా జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. 'తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ - 2025' ప్రకారం దరఖాస్తుల పరిశీలన నుంచి కార్డుల జారీ వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత ఉండాలని ఆమె సూచించారు.

దరఖాస్తుల స్క్రూటినీ, ఆమోదం, రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపు, ఆన్‌లైన్ ద్వారా అక్రిడిటేషన్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని కమిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని డీపీఆర్వోలను కోరారు. అర్హులైన జర్నలిస్టులు మాత్రమే ఈ ప్రయోజనం పొందేలా చూడాలని ఆయన సూచించారు.

అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ http://ipr.telangana.gov.in ద్వారా సమర్పించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా 9154170881 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ చర్యల ద్వారా అక్క్రెడిటేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడం లక్ష్యమని అధికారులు తెలిపారు.