Let's talk: editor@tmv.in
వాయు కాలుష్యంపై ప్రపంచ బ్యాంక్ నివేదికను కేంద్రం పట్టించుకోదా?: కాంగ్రెస్

వాయు కాలుష్యంపై ప్రపంచ బ్యాంక్ నివేదికను కేంద్రం పట్టించుకోదా?: కాంగ్రెస్

Pinjari Chand
19 జనవరి, 2026

గంగా-సింధూ మైదానాలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది వాయు కాలుష్యం కారణంగా ముందుగానే మరణాలకు గురవుతున్నారని పేర్కొన్న ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉదహరిస్తూ, మోడీ ప్రభుత్వం ఇంకా ఎంతకాలం నిరాకరిస్తూ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్)కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ మాట్లాడుతూ దేశంలో తీవ్రతరమవుతున్న ఏక్యూఐ ఆధారిత ఆరోగ్య సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, గాలి కాలుష్య నియంత్రణకు సంబంధించి తమ పార్టీ ఇప్పటికే పలు సూచనలు చేస్తోందన్నారు. గంగా-సింధూ మైదానాలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో వాయు కాలుష్యంపై ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘ఏ బ్రెత్ ఆఫ్ చేంజ్’ అనే తాజా నివేదిక సమగ్రంగా, ఆధారాలతో కూడినదిగా ఉందని, అదే సమయంలో అత్యంత సమయోచితమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది ముందస్తుగా మరణిస్తున్నారు. అలాగే వాయు కాలుష్యం వల్ల ఈ ప్రాంతీయ జీడీపీలో దాదాపు 10 శాతం నష్టం జరుగుతోందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. నివేదికలో సూచించిన చర్యలపై కూడా ఆయన దృష్టి సారించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల ఉద్గార నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, అత్యంత పురాతన విద్యుత్ కేంద్రాలను వేగంగా మూసివేయడం, రాష్ట్రాల సరిహద్దులను దాటేలా చట్టబద్ధ అధికారాలతో కూడిన ఎయిర్‌షెడ్‌ ఆధారిత పాలన అమలు చేయడం అవసరమని తెలిపారు. అలాగే ప్రజా రవాణా విస్తరణ, విద్యుతీకరణ, వాహన ఉద్గారాలు, ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని సూచించారు.

కఠినంగా వ్యవహరించాలి

వాయు కాలుష్య నియంత్రణ కోసం 1981 గాలి కాలుష్య (నియంత్రణ & నివారణ) చట్టం, 2009 జాతీయ వాతావరణ గాలి నాణ్యత ప్రమాణాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పీఎం 2.5 కణాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నట్లు జైరామ్ రమేష్ తెలిపారు. అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ను ఆర్థికంగా, భౌగోళికంగా విస్తరించాలని, పనితీరు కొలమానంగా పీఎం 2.5 స్థాయిలను ఉపయోగించాలని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. మోడీ ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఈ వాస్తవాలను అంగీకరించకుండా నిరాకరిస్తూ జీవిస్తుంది? అని ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, గంగా-సింధూ మైదానాలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో వాయు కాలుష్యం దక్షిణాసియాలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య, అభివృద్ధి సవాళ్లలో ఒకటిగా మారింది. దాదాపు 100 కోట్ల మంది ప్రతిరోజూ ప్రమాదకరమైన గాలిని శ్వాసిస్తున్నారు. దీని వల్ల సగటు ఆయుష్షు మూడు సంవత్సరాలకు పైగా తగ్గిపోతోందని నివేదిక హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం, అధిక ఏక్యూఐ స్థాయిల నేపథ్యంలో రావడం గమనార్హం.

వాయు కాలుష్యంపై ప్రపంచ బ్యాంక్ నివేదికను కేంద్రం పట్టించుకోదా?: కాంగ్రెస్ - Tholi Paluku