
వాతావరణ భూతం
వర్షం వస్తే పుడమి తల్లికి ప్రాణం పోసినట్టు ఉంటుంది. పంటలు నవ్వుతాయి. గాలి తడుస్తుంది . మనసులు హాయిగా ఊపిరి తీసుకుంటాయి.. కానీ ఈసారి కురుస్తున్న వర్షాలు ఆప్యాయత కన్నా ఆవేదనను ఎక్కువగా తెచ్చిపెడుతున్నాయి. హిమాలయాల అంచుల్లో ఉన్న నేపాల్ నుంచి డార్జిలింగ్ కొండల వరకూ వరుణుడు విధ్వంస గీతాన్ని పాడుతున్నాడు. నేపాల్‌లో మూడు రోజుల పాటు కురిసిన నాన్‌స్టాప్ వర్షం నదులను ఉప్పొంగించింది. పర్వతాల పాదాల నుంచి కొండచరియలు కూలి గ్రామాలను మింగేశాయి. ఇల్లామ్ జిల్లాలో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కఠ్మండు వరకు నీరు చేరి ఇళ్లు తడిసిపోతున్నాయి. ప్రజలు సహాయ బృందాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటు ఇండియాలోని డార్జిలింగ్ కొండల్లోనూ అదే దృశ్యం కనిపించింది. ఇక్కడ 20మందికి పైగా మరణించారు. రహదారులు తెగిపోయాయి, ఇళ్లు కూలిపోయాయి. రాత్రంతా కురిసిన వర్షం ఉదయానికి విషాదాన్ని తెచ్చింది.
నిజానికి ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాన్సూన్ సీజన్ ఉంటుంది. అయితే అక్టోబర్ వచ్చినా వర్షాలు తగ్గడంలేదు. కొన్నేళ్లుగా ఈ వర్షపు రూపమే ప్రతీ అక్టోబర్‌లోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు పంటలకు వరంలా నిలిచిన వాన.. ఇప్పుడు ప్రళయంలా దూసుకొస్తోంది. దీనికి కారణం.. వాతావరణ మార్పు అనే భూతం. ఇది మనిషి చేసిన గాయం. అందుకే భూమి వేడెక్కుతోంది.. మంచు కొండలు కరుగుతున్నాయి. ఆ వేడి ఆకాశంలో కొత్త మబ్బులను పుట్టిస్తోంది. ఆ మబ్బులు ఒక్కసారిగా కురుస్తున్నాయి. ఈ క్షణం వాన రాదులే అనుకున్నపుడు వర్షం కురుస్తుంది. వచ్చిన వెంటనే ఆగడం లేదు.. వీధులను తుడిచేస్తుంది.
ఇదంతా సహజం కాదు, ప్రకృతి సహనానికి మించి మనిషి చేసిన తప్పుల ప్రతిఫలం ఇది. అడవులు నరికి, కొండలను కోసి, నదుల మార్గాలను అడ్డుకున్నాం. నగరాలు కాంక్రీటుతో నిండిపోవడంతో భూమికి ఊపిరాడటం లేదు. గాల్లో కార్బన్ పెరిగి, సూర్యతాపం భూమిలో బంధించబడింది. అదే ఉష్ణతా వలయాలుగా మారి వర్షాల స్వభావాన్ని మార్చేస్తోంది. ఇప్పుడు ప్రతి మేఘం అసహనంతో నిండినట్టు ఉంది. ఒక్కసారిగా కురుస్తుంది, ఆవేశంగా కురుస్తుంది. కురిసిన వాన నేలలో కలవదు, మట్టిని మింగేస్తుంది. కొండలు నిలవలేక జారిపోతున్నాయి, నదులు తమ తీరాలు మరిచిపోతున్నాయి. ఈ మార్పు కేవలం ప్రకృతిలో కాదు, మన జీవన విధానంలోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు రుతువుల సరిహద్దులు స్పష్టంగా ఉండేవి, ఇప్పుడు అవి కలిసిపోతున్నాయి. చలికాలం తక్కువైంది, వేసవికాలం మండిపోతోంది, వానకాలం గందరగోళంగా మారింది. ఇది భూమి శ్వాస మారిందని చెప్పేందుకు సంకేతం. మనం దాన్ని సరిచేయకపోతే ఈ వర్షం గీతగా కాదు, గోడుగా మారిపోతుంది. మన భవిష్యత్తు కొట్టుకుపోయే గోలగా మారిపోతుంది.
అటు నేపాల్, డార్జిలింగ్‌లో ప్రజల ఆశ మసకబారలేదు. రక్షణ బృందాలు, సైనికులు, సాధారణ ప్రజలు కలసి జీవాలను రక్షిస్తున్నారు. ముందుగా హెచ్చరికలు ఇచ్చే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేర్చుకుంటున్నారు. పునరావాసం, సహాయం, మనసు బలం ఇవే ఇప్పుడు ఆయుధాలు..! ఇక ప్రకృతితో మన బంధాన్ని తిరిగి గుర్తు చేసుకునే సమయం వచ్చింది. భూమి మనకు ఇచ్చిన ప్రతి వరం ఇప్పుడు ఒక పరీక్షగా మారుతోంది. ఈ వర్షం మన తప్పులను చూపిస్తోంది. అందుకే మనం మళ్ళీ చెట్లను నాటాలి, నదులకు దారి ఇవ్వాలి, పర్వతాలను కాపాడాలి. వాతావరణాన్ని శత్రువుగా కాకుండా స్నేహితుడిగా చూడడం నేర్చుకోవాలి. ఎందుకంటే భూమి మన ఇంటికి పునాది లాంటిది. ఆ పునాదులు కదిలిపోతే మనం నిలబడలేం.
ఆకాశం ఎప్పుడు ఏడుస్తుందో చెప్పలేం కానీ భూమి ఎందుకు ఏడుస్తుందో మనకు తెలుసు. మన నిర్లక్ష్యం, మన స్వార్థం దానికి కారణం. ఇప్పుడు మనం దాన్ని సరిచేయాల్సిందే. అది ప్రేమతో, జాగ్రత్తతో చేయాల్సిన పని. ప్రతి చినుకులో ఒక పాఠం ఉంది.. ఆ పాఠం చెప్పే మాట ఒక్కటే.. ప్రకృతిని గౌరవించు, దాన్ని కాపాడు, దానితోనే కలసి జీవించు. ఎందుకంటే అదే మన భవిష్యత్తు.. అదే మన ప్రాణం...!
