Let's talk: editor@tmv.in
వాతావరణ బాధ్యతల నుంచి అమెరికా వెనకడుగు

వాతావరణ బాధ్యతల నుంచి అమెరికా వెనకడుగు

Shashank Sekhar
15 జనవరి, 2026

ప్రపంచ వాతావరణ పరిరక్షణ ప్రయత్నాలకు అమెరికా మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన అధ్యక్ష ఆదేశాల ద్వారా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు చట్టం (యూఎన్ఎఫ్సీసీసీ)తో పాటు 65 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇవన్నీ అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం అంటూ ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా వాతావరణ మార్పుపై గ్లోబల్ సహకార వ్యవస్థ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి వెనక్కి తగ్గినట్టయ్యింది. జో బైడెన్ హయాంలో పున:ప్రారంభమైన అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఈ నిర్ణయం పూర్తిగా రద్దు చేసినట్లయింది. ట్రంప్ తన తొలి పదవీకాలంలో పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన నిర్ణయానికి కొనసాగింపుగా మారింది.

గ్లోబల్ వాతావరణ ఒప్పందాల అవసరం ఏమిటి?

వాతావరణ మార్పు వ్యవస్థలు ప్రతీకాత్మక చర్యలు కావని, దేశాల సార్వభౌమత్వానికి ముప్పు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

1992లో స్వీకరించిన యూఎన్ఎఫ్సీసీసీ ఒప్పందం వాతావరణ మార్పుపై అంతర్జాతీయ సహకారానికి పునాది వేసింది. ఇదే క్యోటో ప్రోటోకాల్, పారిస్ ఒప్పందం వంటి కీలక ఒప్పందాలకు మార్గదర్శకంగా నిలిచింది. వాతావరణ మార్పు సరిహద్దులను గుర్తించదు. ఒక దేశంలో వెలువడే కార్బన్ ఉద్గారాలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలు, ప్రజల జీవన విధానాలపై ప్రభావం చూపుతాయి. ఈ వ్యవస్థల మౌలిక సూత్రం సాధారణమే కానీ భిన్నమైన బాధ్యతలు అంటే పారిశ్రామికీకరణను ముందుగా అందుకుని అభివృద్ధి చెందిన దేశాలు, చరిత్రాత్మకంగా ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసిన దేశాలు, వాతావరణ మార్పు నియంత్రణలో ముందుండి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన. వాతావరణ నిధులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సామర్థ్య నిర్మాణం అనేవి దాతృత్వ చర్యలు కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్బన్ ఆధారిత అభివృద్ధి మార్గాన్ని మళ్లీ అనుసరించకుండా ఉండేందుకు అవసరమైన సాధనాలు.

అమెరికా కీలక అడుగు– ప్రపంచానికి పెరుగుతున్న ముప్పు

అమెరికా వైదొలగడం వల్ల గ్లోబల్ వాతావరణ వ్యవస్థ విశ్వాసం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చరిత్రలో అతిపెద్ద కాలుష్యకారక దేశాల్లో ఒకటైన అమెరికా పాత్ర ఆర్థికంగానే కాక నైతికంగా కూడా దాని నాయకత్వం కీలకమైనది. ఈ ఒక్క నిర్ణయంతో వాతావరణ పరిరక్షణకు కేటాయించే నిధులు తగ్గిపోవడం, పెద్ద దేశాలపై, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి ఉండకపోవడం, అంతర్జాతీయ బాధ్యత బలహీనపడటం లాంటివి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే వాతావరణ ఒప్పందాలు తాత్కాలిక రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయనే సందేశం ప్రపంచానికి వెళ్లడం. దీంతో వాతావరణ మార్పుపై సందేహాలు కలిగిన ప్రభుత్వాలకు ఇది ఒక రక్షణ కవచంగా మారే అవకాశం ఉంది.

చిన్న దీవి దేశాలు, అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు, వాతావరణ ప్రభావాలకు గురవుతున్న దేశాలకు ఇది తీవ్రమైన దెబ్బ.

అత్యధిక తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, ఆహార భద్రత సమస్యలు పెరుగుతున్న సమయంలో వనరులు తగ్గిపోవడం వారి పరిస్థితిని మరింత కఠినం చేస్తోంది.

భవిష్యత్తు దారి – విభజనలో సహకారం సాధ్యమా?

వాతావరణ ఒప్పందాలు ఉద్గార లక్ష్యాలు లేదా నిధులకే పరిమితం కావు.

అవి శాస్త్రీయ సమాచార పంపకం, డేటా సమన్వయం, దేశాల మధ్య నమ్మకం పెంపొందించడం వంటి కీలక పాత్రలు కూడా పోషిస్తాయి. ఈ వ్యవస్థలు బలహీనపడితే ప్రపంచ ప్రతిస్పందన కూడా చీలిపోతుంది. సాంకేతిక ఆవిష్కరణలు లేదా మార్కెట్ శక్తులే సరిపోతాయని కొందరు వాదించినా, ఉమ్మడి నియమాలు లేకుండా పురోగతి అసమానంగా, అసంపూర్తిగా ఉంటుందన్నది గత అనుభవం. వాతావరణ మార్పు ఎన్నికల చక్రాలకు ఎదురుచూడదు, జాతీయ సరిహద్దులను గౌరవించదు. ప్రపంచ వాతావరణ భవిష్యత్తు – పెద్ద దేశాల దీర్ఘకాలిక బాధ్యత, స్థిరమైన నిధులు, నైతిక నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయంలో ఒక అభివృద్ధి చెందిన దేశం బాధ్యతల నుంచి తప్పుకుంటే, అది విధానాలకే కాదు – ప్రపంచ బాధ్యత ప్రమాణాలకే మార్పు తెస్తుంది.

వాతావరణ సంక్షోభంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం

ప్రపంచ వాతావరణ సంక్షోభం మరింత తీవ్రతరం అవుతున్న వేళ, అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతల నుంచి వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో, అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారమైన బాధ్యత పడుతోంది. ముఖ్యంగా అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు గ్లోబల్ వాతావరణ ఒప్పందాల నుంచి వైదొలుగుతున్న నిర్ణయాలు, ప్రపంచ సమూహానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు నిస్సహాయంగా ఉండకుండా, ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడంలో సంఖ్యాబలమే ప్రధాన ఆయుధమని, జీ77, బ్రిక్స్, ఆఫ్రికన్ యూనియన్, చిన్న దీవి దేశాల కూటమి వంటి వేదికల ద్వారా ఒకే గొంతుతో ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలి.

వాతావరణ మార్పు అంశాన్ని ఇక దయాభిక్షగా కాకుండా హక్కుల అంశంగా మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. చారిత్రకంగా అధిక ఉద్గారాలకు కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత వహించాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించాలి. వాతావరణ న్యాయాన్ని మానవహక్కుల సమస్యగా ప్రపంచం ముందుంచాలి. అంతర్జాతీయ వేదికలైన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం వంటి సంస్థల ద్వారా వాతావరణ ఒప్పందాల అమలుపై అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచాలి. అవసరమైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు చట్టపరమైన మార్గాలను కూడా అనుసరించాలి.

అభివృద్ధి చెందిన దేశాల నిధులపై పూర్తిగా ఆధారపడకుండా, వారిని దేబిరించడం మాని, స్వయం ఆధార వాతావరణ వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. పునరుత్పాదక శక్తి వినియోగం, వాతావరణ అనుకూల వ్యవసాయం, నీటి వనరుల సంరక్షణ, అడవుల పునరుద్ధరణ వంటి అంశాలపై తక్షణ దృష్టి పెట్టాలి.

అదేవిధంగా దక్షిణ–దక్షిణ సహకారాన్ని బలోపేతం చేయాలి. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సాంకేతికత, పెట్టుబడుల పరంగా ముందుకు రావాలి. ఇది అభివృద్ధి చెందిన దేశాల వెనక్కి తగ్గినప్పటికీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

వాతావరణ మార్పును కేవలం పర్యావరణ సమస్యగా కాకుండా, ఆర్థిక, ఆరోగ్య, ఆహార భద్రత సమస్యగా భావించి, దేశీయ రాజకీయ అజెండాలో ప్రధానంగా చేర్చాలి. జాతీయ బడ్జెట్లలో వాతావరణ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రజల్లో అవగాహన పెంపు కీలకం కావాలి. వాతావరణ బాధ్యతల నుంచి తప్పుకునే దేశాలను అంతర్జాతీయంగా రాజకీయంగా ఒంటరి చేసి, దౌత్యం, వాణిజ్యం, ప్రజాభిప్రాయాల ద్వారా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. నిపుణుల మాటల్లో వాతావరణ సంక్షోభం భవిష్యత్తు సమస్య కాదు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ స్థాయి సంక్షోభం. దీనిని ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఐక్యత, నైతిక బాధ్యత, కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.