
వాణిజ్య ఒప్పందంలో భారత్ ప్రయోజనాలు కాపాడాం: పీయూష్ గోయల్
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో దేశ రైతులు, దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన రక్షణ చర్యలు (సేఫ్‌గార్డ్స్) అమలులో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దిగుమతులు గణనీయంగా పెరిగి దేశీయ రంగాలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ వాణిజ్య ఒప్పందం చివరికి భారత రైతులకే మేలు చేస్తుందని గోయల్ అన్నారు. ఇప్పటికే భారత్ నుంచి వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 50–55 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు పోటీ ప్రయోజనం ఉంటుందని తెలిపారు. భారత వస్తువులపై అమెరికా విధించే సుంకం సగటున 18 శాతం మాత్రమే ఉండగా, చైనా వంటి పోటీ దేశాలపై ఇది 35 శాతం వరకు, మరికొన్ని దేశాలపై 19 శాతం కంటే ఎక్కువగా ఉంటోందని చెప్పారు.
భారత్–అమెరికా సంయుక్త ప్రకటన కేవలం రెండు పేజీల పత్రం మాత్రమేనని, కానీ ఇది ఒక ప్రక్రియలో భాగమని గోయల్ వివరించారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) సందర్భంలో క్యాబినెట్‌కు విస్తృత పత్రాలను సమర్పించినట్లు గుర్తుచేశారు. ఇది రెండు వైపులా రక్షణ చర్యలతో కూడిన ప్రక్రియ. భారత్ తమ మార్కెట్‌ను కాపాడుకున్నట్లే, అమెరికా కూడా తన మార్కెట్ రక్షణను కోరుకుంటుంది. ఇది ఏ వాణిజ్య చర్చలోనైనా సహజమైన అంశమే అని అన్నారు. రెండు పేజీల సంయుక్త ప్రకటనలో రక్షణ చర్యలు లేవని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని వ్యాఖ్యానించారు. ఇంకా చాలా అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు.
కొన్ని ఉత్పత్తుల విషయంలో భారత్, అమెరికా రెండూ సున్నితంగా వ్యవహరిస్తున్నాయని, ఆ రంగాల్లో రక్షణ చర్యలు అమలులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా డెయిరీ ఉత్పత్తులకు భారత్ ఎలాంటి సుంక రాయితీలు ఇవ్వలేదని, జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ, సోయామీల్, మొక్కజొన్నలకు కూడా మార్కెట్‌లోకి ప్రవేశం కల్పించలేదని స్పష్టం చేశారు. అయితే, భారత్ దిగుమతి చేసుకునే కొన్ని పప్పుధాన్యాలు, పప్పుల విషయంలో మాత్రం పరిమిత స్థాయిలో మార్కెట్ ప్రవేశం కల్పించామని తెలిపారు. ఇది పరస్పర లాభాల ప్రక్రియ. మనం ఏమీ ఇవ్వకపోతే, అమెరికా మార్కెట్‌ను మన రైతుల కోసం ఎలా తెరవగలం? అని గోయల్ ప్రశ్నించారు.
భారత్ తన రంగాలను చాలా జాగ్రత్తగా, దశలవారీగా తెరిచిందని మంత్రి చెప్పారు. ఇవన్నీ భారత ఆర్థిక వృద్ధికి, ముఖ్యంగా ప్రాసెస్డ్ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని ఆశించే రైతులకు దోహదపడతాయని తెలిపారు. డ్రై ఫ్రూట్స్‌పై మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 3.5 బిలియన్ డాలర్ల విలువైన డ్రై నట్లు దిగుమతి చేసుకుంటోందని, అందులో ఇప్పటికే ఒక బిలియన్ డాలర్ల మేరకు అమెరికా నుంచే వస్తున్నాయని చెప్పారు. అవి అమెరికా నుంచే వచ్చినా నాకు అభ్యంతరం లేదు. వినియోగదారులకు మేలు జరుగుతుంది. చివరికి 140 కోట్ల మంది భారతీయులే అతిపెద్ద స్టేక్‌హోల్డర్లు. వారికి తక్కువ ధరలకు వస్తువులు లభిస్తే ఎందుకు వద్దు? అని గోయల్ వ్యాఖ్యానించారు.
