Let's talk: editor@tmv.in
వాణిజ్య ఎల్పీజీ ధరల పెంపు.. సామాన్యుడిపై భారం: కాంగ్రెస్ ఎంపీలు

వాణిజ్య ఎల్పీజీ ధరల పెంపు.. సామాన్యుడిపై భారం: కాంగ్రెస్ ఎంపీలు

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని, వ్యాపారాలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ ధరల పెంపును నిరసిస్తూ పలువురు ఎంపీలు ప్రకటనలు విడుదల చేశారు.

కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ, ఈ పెంపు వల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని, దీనివల్ల సామాన్యులే ఎక్కువగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిండర్ల ధరల పెంపును ప్రధాని వెంటనే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ వంశీకృష్ణ గడ్డం స్పందిస్తూ, ప్రభుత్వం సామాన్యుడిని 'పానిక్ మోడ్'లోకి నెట్టిందని విమర్శించారు. ప్రజల పక్షాన తాము పార్లమెంటులో ఈ అంశంపై గళమెత్తుతామని ఆయన హామీ ఇచ్చారు.

ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్పీజీ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలను ప్రభుత్వం ఇంకెంత కాలం ఇలా దోచుకుంటుందో ప్రధాని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మరో ఎంపీ రాజీవ్ శుక్లా స్పందిస్తూ, ఇది చాలా పెద్ద పెంపు అని, చిన్న తరహా వ్యాపారాల మీద దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో ముఖ్య నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 195.50 పెరిగి ఇప్పుడు రూ. 2,078.50 కి చేరుకుంది. 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధర రూ. 51 పెరిగి రూ. 549 కి చేరుకుంది. కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ. 218 మేర పెరుగుదల కనిపించింది. అయితే, గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కిలోలు) ధరలలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. మార్చి 7న రూ. 60 పెరిగిన తర్వాత, ఢిల్లీలో దీని ధర ప్రస్తుతం రూ. 913 గా కొనసాగుతోంది. వాణిజ్య సిలిండర్ల పెంపు పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుందని ఆర్థిక నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.