
వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.49 పెంపు
దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. తాజా సవరణ ప్రకారం, కమర్షియల్ సిలిండర్ పై రూ. 49 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, సామాన్య ప్రజలకు, గృహిణులకు ఉపశమనం కలిగిస్తూ 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
నగరాల వారీగా కొత్త ధరలు ఇలా..
చమురు సంస్థలు పెంచిన ధరల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,740.50 కు చేరుకుంది. అంతకుముందు జనవరి నెలలో కూడా ఈ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. జనవరిలో ఒక్కో సిలిండర్‌పై రూ. 111 పెరగడంతో ధర రూ. 1,691.50 వద్ద ఉండేది. ఇప్పుడు ఆ ధర మరింత భారం కానుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ. 1,961.50 వరకు ఉండవచ్చని అంచనా.
హోటళ్లు, రెస్టారెంట్లపై అదనపు భారం
వరుసగా రెండో నెల కూడా వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడం హోటల్ వ్యాపారులకు, క్యాటరింగ్ సర్వీసులకు, చిన్న చిన్న తినుబండారాల దుకాణాల వారికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. దీనివల్ల బయట దొరికే ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలోనే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను కూడా రూ.27 పెంచిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఏమంటోంది?
మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో గ్యాస్ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రస్తుతం సుమారు 33 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయని, అందులో ఉజ్వల పథకం కింద 10.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కేవలం కనెక్షన్లు ఇవ్వడమే కాకుండా, ప్రజలు క్రమం తప్పకుండా సిలిండర్లు రీఫిల్ చేసుకుంటున్నారని, రోజూ దేశవ్యాప్తంగా 55 లక్షలకు పైగా సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
