
వాట్సాప్ ‘ఘోస్ట్ పైరింగ్’ లోపంపై జాతీయ సైబర్ భద్రతా సంస్థ హెచ్చరిక
వాట్సాప్‌లోని డివైస్–లింకింగ్ ఫీచర్‌లో ఉన్న తీవ్రమైన భద్రతా లోపాన్ని భారత సైబర్ భద్రతా సంస్థ గుర్తించింది. ఈ లోపాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ యూజర్ల ఖాతాలను పూర్తిగా కబ్జా చేస్తున్నారని సంస్థ హెచ్చరించింది. ఈ దాడికి ‘ఘోస్ట్ పైరింగ్ ’ అని పేరు పెట్టినట్లు జాతీయ సైబర్ భద్రతా సంస్థ తన తాజా సలహాలో తెలిపింది.
పాస్‌వర్డ్ లేదా సిమ్ స్వాప్ అవసరం లేకుండానే వాట్సాప్ ఖాతాను హైజాక్ చేయగలిగేలా ఈ లోపం ఉందని పేర్కొంది. హ్యాకర్లు బాధితుల రియల్‌టైమ్ సందేశాలు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్లను చూడడమే కాకుండా, వారి తరఫున మెసేజులు పంపే స్థాయిలో నియంత్రణ చేయొచ్చని స్పష్టం చేసింది.
జాతీయ సైబర్ భద్రతా సంస్థ ప్రకారం ఈ దాడి సాధారణంగా బాధితుడికి తెలిసిన కాంటాక్ట్ నుంచి వచ్చినట్లు కనిపించే హయ్ చెక్ దిస్ ఫోటోస్ వంటి మెసేజ్‌తో ప్రారంభమవుతుంది. ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ ఫేస్ బుక్ తరహా ప్రివ్యూ చూపించి, నకిలీ వెబ్‌పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ కంటెంట్ చూడాలంటే వెరిఫై చేయాలని చెప్పి ఫోన్ నంబర్ అడుగుతారు. బాధితుడు నంబర్ ఇచ్చిన వెంటనే, హ్యాకర్ తన డివైస్‌ను వాట్సాప్ లింక్డ్ డివైస్ గా జోడించుకుని ఖాతాను తన ఆధీనంలోకి తీసుకుంటాడు.
ఒకసారి హ్యాకర్ డివైస్ లింక్ అయిన తర్వాత, వాట్సాప్ వెబ్‌లో బాధితుడికి ఉన్నదాదాపు మొత్తం యాక్సెస్ అతడికి లభిస్తుందని జాతీయ భద్రతా సంస్త తెలిపింది. మెసేజులు చదవడం, కొత్త మెసేజులు రియల్‌టైమ్‌లో పొందడం, ఫోటోలు–వీడియోలు చూడడం, కాంటాక్టులు, గ్రూప్‌లకు మెసేజులు పంపడం కూడా సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలిసిన కాంటాక్టుల నుంచి వచ్చినా అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ లేదా ఫేస్ బుక్ అని చెప్పుకునే బయటి వెబ్‌సైట్లలో ఫోన్ నంబర్ నమోదు చేయవద్దని హెచ్చరించింది. లింక్డ్ డివైస్ విభాగాన్ని తరచూ పరిశీలించి అనుమానాస్పద డివైస్‌లు ఉంటే తొలగించాలని, రెండు దశల ధృవీకరణ (టూ స్టెప్ వెరిఫికేషన్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ )ను తప్పనిసరిగా ప్రారంభించాలని సూచించింది. ఈ అంశంపై వాట్సాప్ నుంచి స్పందన రావాల్సి ఉందని వివరించింది.
