
వాజ్‌పేయ్‌కు నివాళిగా లక్నోలో ‘రాష్ట్రప్రేరణ స్థల్’
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి జీవితం, ఆలోచనలు, ఆదర్శాలకు ఘన నివాళిగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ను ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 25న(గురువారం) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 25 వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని లక్నో పర్యటన చేపడుతున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను ప్రారంభించి సభలో మాట్లాడతారని వివరించారు.
రూ.230 కోట్ల వ్యయంతో
స్వాతంత్రం అనంతర భారతదేశానికి చెందిన మహనీయుల వారసత్వాన్ని గౌరవించాలనే దూరదృష్టితో ప్రధాని మోడీ రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య, రాజకీయ, అభివృద్ధి ప్రయాణంపై చెరగని ముద్ర వేసిన వాజ్‌పేయి నాయకత్వానికి ఇది శాశ్వత స్మారకంగా నిలవనుందని వెల్లడించారు. సుమారు రూ.230 కోట్ల వ్యయంతో, 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయం జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక, ప్రేరణాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంది. నాయకత్వ విలువలు, జాతీయ సేవా భావం, సాంస్కృతిక చైతన్యం, ప్రజలకు ప్రేరణ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యంగా తెలిపారు.
అదునికి డిజిటల్ మ్యూజియం
ఈ ప్రాంగణంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయిలకు చెందిన 65 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇవి భారత రాజకీయ ఆలోచన, దేశ నిర్మాణం, ప్రజాసేవలో వారి విశిష్ట సేవలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. అలాగే, కమలాకారంలో నిర్మించిన అత్యాధునిక మ్యూజియం కూడా ఇందులో భాగంగా ఉంది. సుమారు 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో ఆధునిక డిజిటల్, ఇమర్సివ్ సాంకేతికతల ద్వారా భారత జాతీయ ప్రయాణం, ఈ నేతల సేవలను ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రేరణ స్థల్ ప్రారంభం ద్వారా నిస్వార్థ నాయకత్వం, సుశాసన విలువలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచే కీలక అడుగు పడిందని అధికారిక ప్రకటన పేర్కొంది.
