Let's talk: editor@tmv.in
వాచ్‌మెన్‌ నుంచి కల్పెట్ట మునిసిపాలిటీ చైర్మన్‌గా గిరిజన యువకుడు

వాచ్‌మెన్‌ నుంచి కల్పెట్ట మునిసిపాలిటీ చైర్మన్‌గా గిరిజన యువకుడు

Pinjari Chand
29 డిసెంబర్, 2025

ఎరుపు రంగు బోర్డుతో.. దానిపై ఓ పేరుతో ఉన్న ఓ అధికారిక వాహానం గిరిజన కాలనీలోని టిన్–టార్ఫాలిన్ తో నిర్మించుకున్న ఓ చిన్న గుడిసె ముందు ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగి నేరుగా ఆ గుడిసె ముందు నిలుచున్న వ్యక్తికి పాదాభివందనం చేశారు. లోపలి నుంచి మరోక ఆమె వచ్చింది ఆమెకు నమస్కరించారు. వయనాడ్ లో చోటుచేసుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం పాదాభివందనం చేసిన వ్యక్తి వాచ్ మెన్ నుంచి కల్పెట్ట మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తన తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. పానియా గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి ఉన్నత హోదా పొందడంతో ప్రజలు సంతోషించారు.

కేరళలోని పర్వత ప్రాంత జిల్లా వయనాడ్‌లో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. పి. విశ్వనాథన్ అనే పానియా గిరిజన యువకుడు కల్పెట్ట మునిసిపాలిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, ఆ పదవిని చేపట్టిన మొదటి పానియా గిరిజన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం విశ్వనాథన్ తన తల్లిదండ్రుల ఆశీస్సులు పొందేందుకు నేరుగా వారి నివాసానికి వెళ్లాడు. అధికారిక వాహనం ఎరుపు రంగు బోర్డుతో గిరిజన కాలనీలోని టిన్‌–టార్పాలిన్‌తో కప్పబడిన చిన్న గుడిసె ముందు ఆగింది. తన కుమారుడు ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రులు ఎంతో నిశ్శబ్దంగా, గౌరవంతో అతన్ని స్వాగతించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో విశ్వనాథన్ తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీస్సులు పొందిన దృశ్యం కనిపించింది. ఆ సమయంలో ఆయన తల్లి నా కొడుకు ఇంత ఎత్తుకు ఎదిగాడు. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ అతన్ని హత్తుకుంది.

40 ఏళ్ల విశ్వనాథన్, వృత్తిరీత్యా ఒక వాచ్‌మన్, అలాగే జానపద గాయకుడు. ఆయన వయనాడ్ జిల్లాలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్త. వెనుకబడిన పానియా గిరిజన సమాజం నుంచి ఒక వ్యక్తి మునిసిపాలిటీ చైర్మన్ స్థాయికి ఎదగడం గిరిజన చరిత్రలో అరుదైన ఘట్టంగా భావిస్తున్నారు.

పానియా గిరిజన సమాజం కేరళలోని అత్యధిక జనాభా కలిగిన షెడ్యూల్డ్ ట్రైబ్ గా గుర్తింపు పొందింది. ఈ సమాజం ప్రధానంగా వయనాడ్, కోజికోడ్, కన్నూర్, మలప్పురం జిల్లాల్లో నివసిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వనాథన్ ఎడగుని వార్డు (వార్డు నంబర్ 28) నుంచి సాధారణ సీటులో పోటీ చేసి 424 ఓట్లతో విజయం సాధించారు. అనంతరం కల్పెట్ట మునిసిపాలిటీ చైర్మన్ పదవి షెడ్యూల్డ్ ట్రైబ్‌కు రిజర్వ్ కావడంతో, సీపీఐ(ఎం) పార్టీ ఆయనను ఆ కీలక బాధ్యతకు ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ గిరిజన సమాజాలు ఇంకా అనేక రంగాల్లో ప్రధాన సమాజానికి వెనుకబడి ఉన్నాయి. నా ఈ స్థానం ద్వారా మార్పు తీసుకురావాలని ఉంది. నా ప్రయాణం నా సమాజంలోని యువతకు ప్రేరణగా నిలవాలి అని చెప్పారు.

సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు వి. హరిస్ విశ్వనాథన్ నాయకత్వ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. సాధారణ సీటులో గెలవడం ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.