Let's talk: editor@tmv.in
వాంగ్‌చుక్‌పై పెట్టిన కేసుకు బలం లేదు: గీతాంజలి ఆంగ్మో

వాంగ్‌చుక్‌పై పెట్టిన కేసుకు బలం లేదు: గీతాంజలి ఆంగ్మో

Pinjari Chand
19 జనవరి, 2026

వాతావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేయడం దేశంలోని ప్రజాస్వామ్య స్థితిని ప్రతిబింబిస్తోందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని, కోర్టులో ప్రభుత్వం పదేపదే వాయిదాలు మాత్రమే కోరుతోందని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో విమర్శించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారుల వైపు నుంచి జరిగిన ప్రక్రియాపరమైన లోపాల కారణంగా వాంగ్‌చుక్‌ ఇప్పటికే జైలు నుంచి విడుదల కావాల్సి ఉండేదని, ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ అని ఆంగ్మో అన్నారు. అయితే, ఈ నిర్బంధంపై సమాజం నుంచి బలమైన వ్యతిరేకత కనిపించకపోవడంపై తాను కొంచెం నిరాశ చెందుతున్నానని ఆమె చెప్పారు. మనమంతా మౌనంగా ఉండలేం. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా సమష్టిగా, గట్టిగా గొంతు వినిపించాలని ఆమె పిలుపునిచ్చారు.

మెగసేసే అవార్డు గ్రహీత అయిన వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్‌ను సెప్టెంబర్‌ 26న ఎన్‌ఎస్‌ఏ కింద నిర్బంధించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో జరిగిన నిరసనల్లో నలుగురు మృతి చెందగా, 90 మంది గాయపడిన రెండు రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. అనంతరం ఆయనను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు.

సోనమ్ ను విడుదల చేయాలి

ఇది సోనం వాంగ్‌చుక్‌ అనే వ్యక్తి గురించి మాత్రమే కాదు. ఈ దేశంలోని ప్రజాస్వామ్య స్థితి గురించి. దేశం కోసం పనిచేసిన వారిని అక్రమంగా నిర్బంధించేందుకు అధికారాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే అసలు ప్రశ్న. సోనమ్‌కు ఇలా జరగగలిగితే, రేపు ఎవరికైనా జరగవచ్చు అని ఆంగ్మో అన్నారు. వాంగ్‌చుక్‌తో కలిసి హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్, లడఖ్‌ (హెచ్ఐఏఎల్)ను స్థాపించిన ఆంగ్మో, ఆయన నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు. నిర్బంధ ఉత్తర్వు కాపీ పొందడం నుంచే చాలా కష్టంగా మారింది. సోనమ్‌ను కలవాలన్నా సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. అది దాఖలైన తర్వాత కూడా ఆయన చేతిరాత కాగితాలు పొందడం ఓ పెద్ద సవాలుగా మారిందని ఆమె తెలిపారు. వాంగ్‌చుక్‌ నిర్బంధానికి సంబంధించిన ఆయన చేతిరాత కాగితాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో సమర్పించిన న్యాయపత్రాల్లో భాగంగా ఉన్నాయి.

పాత ఆధారాలే చూపుతున్నారు

ఎన్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం, నిర్బంధానికి గల కారణాలను చూపించే అన్ని పత్రాలను గరిష్ఠంగా ఐదు నుంచి పది రోజుల్లోనే నిర్బంధితుడికి అందజేయాల్సి ఉంటుందని ఆంగ్మో గుర్తుచేశారు.

కానీ ఆ నాలుగు వీడియోలను ఆయనకు అక్టోబర్‌ 23న, అంటే 28వ రోజున ఇచ్చారు. ఇది తీవ్రమైన ప్రక్రియాపరమైన లోపం. దీని ఆధారంగానే ఈ నిర్బంధ ఉత్తర్వును ప్రారంభం నుంచే చెల్లదని ప్రకటించి రద్దు చేయాలని చెప్పారు. ఇది ఒక్క కారణం చాలు. ఎందుకంటే ఇది ఎన్‌ఎస్‌ఏ సెక్షన్‌ 8కు స్పష్టమైన ఉల్లంఘన. అంతేకాదు, వీడియోలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఆయన సలహా బోర్డు ముందు సమర్థవంతమైన వాదన వినిపించే అవకాశం కోల్పోయారు. ఇది ఎన్‌ఎస్‌ఏ సెక్షన్‌ 11 ఉల్లంఘన కూడా అని వివరించారు. వాంగ్‌చుక్‌పై చూపిన నిర్బంధ కారణాలు పాతవేనని, కొన్ని వీడియోలు ఏడాది లేదా ఏడాదిన్నర క్రితం నాటివని ఆమె చెప్పారు.

ఆధారంగా చూపిన ఐదు ఎఫ్‌ఐఆర్‌లలో మూడు కేసుల్లో వాంగ్‌చుక్‌ పేరు లేదని, పేరు ఉన్న రెండు కేసుల్లో ఒకటి 2025 ఆగస్టుకు చెందినదని, ఆ కేసులో కూడా ఎలాంటి నోటీసు లేదా విచారణ జరగలేదని తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వు, ఎస్పీ ప్రతిపాదనను యథాతథంగా కాపీ–పేస్ట్ చేసినట్టుగా ఉందని ఆంగ్మో ఆరోపించారు.

జిల్లా మేజిస్ట్రేట్ స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. యాంత్రికంగా కాపీ చేయకూడదు. ఈ విషయంలో అనేక న్యాయ తీర్పులు ఉన్నాయి. మేధోపయోగం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తే అవి చెల్లవని ఆమె అన్నారు. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో వాంగ్‌చుక్‌ నిర్బంధ అంశం లేవనెత్తినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా లడఖ్ ఎంపీ మహ్మద్ హనీఫా ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు మైక్ కట్ చేయడంపై ఆమె ప్రస్తావించారు. కానీ ఇది ఇంకా పెద్ద స్థాయిలో లేవనెత్తాల్సిందని అనిపిస్తోందని అన్నారు.

రాజకీయ రంగు పులిమే ఉద్దేశం మాకు లేదు

ఈ కేసును రాజకీయంగా మార్చాలనే ఉద్దేశం తమకు లేదని, కానీ జరుగుతున్న ఆలస్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ప్రతిసారి వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. కేసుకు బలం లేదని వారికి అర్థమైనందుకే ఈ ఆలస్యపు వ్యూహాలు అనుకుంటున్నానని విమర్శించారు. అయితే ఇతర కేసులతో పోలిస్తే మాకు మాత్రం కోర్టులో తేదీలు కొంత వేగంగానే వస్తున్నాయని నాకు చెప్పారు అని ఆమె అన్నారు.

గత మూడున్నర నెలల్లో సమాజం మరింతగా విభజితమవుతోందని తనకు అనిపిస్తోందని ఆంగ్మో చెప్పారు. మనమంతా ఏ పార్టీకి చెందినవాళ్లమో, ఏ వర్గానికో చెందినవాళ్లమో అన్న కోణంలో ఆలోచిస్తున్నాం. నా విజ్ఞప్తి ఏమిటంటే పార్టీ భావజాలాలకు అతీతంగా, స్వతంత్ర భారతదేశానికి నిజమైన పౌరులుగా ఆలోచించాలని ఆమె అన్నారు. హెచ్ఐఏఎల్, సెక్ మోల్ వంటి మా సంస్థల ద్వితీయ స్థాయి నాయకత్వాన్ని నేను నిజంగా అభినందించాలి. ఈ పరిస్థితుల్లోనూ ఎలాంటి అంతరాయం కలగకుండా వారు సంస్థలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.అయితే, ఈ కేసు కారణంగా కొత్త ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని చెప్పారు. టీచర్ ట్రైనింగ్ ఫెలోషిప్, కిండర్‌గార్టెన్ నుంచి కే–12 పాఠశాల వరకు ప్రారంభించాలనుకున్న ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని వివరించారు. కొంతమంది ఫండింగ్ సంస్థలు తమపై నిధులు ఆపాలని ఒత్తిడి వస్తోందని చెప్పినట్టు ఆమె వెల్లడించారు. అయితే ఇంతకుముందు హెచ్ఐఏఎల్ గురించి ఎక్కువ మందికి తెలియదని కొందరు చెప్పేవారు. కానీ ఇప్పుడు మరింత మంది మా సంస్థ గురించి తెలుసుకుంటున్నారు. ఈ కష్టకాలాన్ని దాటాక మళ్లీ విస్తృతమైన మద్దతు లభిస్తుందని నమ్ముతున్నాను అని ఆమె అన్నారు.