Let's talk: editor@tmv.in
వైసీపీపై అన‌ర్హ‌త వేటు వేస్తే..ఎన్నిక‌ల‌కు ?

వైసీపీపై అన‌ర్హ‌త వేటు వేస్తే..ఎన్నిక‌ల‌కు ?

FL - BRTH
21 సెప్టెంబర్, 2025

వైసీపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌డంపై ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. జ‌గ‌న్ అసెంబ్లీకి రావాలంటూ స్పీక‌ర్ అయ్యన్న‌పాత్రుడు కోరారు. కానీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వ‌స్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ గ‌తంలో తేల్చిచెప్పారు. తాజాగా జ‌గ‌న్ వైఖ‌రిలో కొంత మార్పు క‌నిపిస్తున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత హోదా ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు క‌నీసం చంద్ర‌బాబుతో స‌మానంగా స‌భ‌లో మాట్లాడే స‌మ‌యం ఇవ్వాల‌ని కోరిన‌ట్టు రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్యేల స‌మావేశంలో ఈ వ్యాఖ్యలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

వైఎస్ జ‌గ‌న్ కోరిన‌ట్టు ముఖ్య‌మంత్రితో స‌మానంగా స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే స‌మ‌యమే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా డిమాండ్ నుంచి కాస్త త‌గ్గి స‌భ‌లో స‌మ‌యం ఎక్కువ‌గా ఇవ్వాల‌ని కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌గ‌న్ కోరిన‌ట్టు స‌భ‌లో చంద్ర‌బాబుతో స‌మానంగా స‌మ‌యం ఇచ్చే ప‌రిస్థితి లేదు. కాబ‌ట్టి జ‌గ‌న్ అసెంబ్లీకి రారు అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ 60 రోజుల పాటు అసెంబ్లీకి రాక‌పోతే అన‌ర్హ‌త వేటు వేస్తామ‌ని డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్ర‌స్తుతం హాట్ టాపిక్ న‌డుస్తోంది.

డిప్యూటీ స్పీక‌ర్, టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లపై కూడా జ‌గ‌న్ తో వైసీపీ ఎమ్మెల్యేలు చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసినట్టు స‌మాచారం. `60 రోజుల అసెంబ్లీ స‌మావేశాల్లో..ఇప్పుడు జ‌రుగుతున్న స‌మావేశాల‌తో క‌లిపి 35 రోజులు పూర్త‌వుతాయి. ఇంకా 25 రోజుల స‌మ‌యం ఉంది. ఆ 25 రోజులు ముగియాలంటే ఇంకా ఐదారు సార్లు స‌మావేశాలు జ‌ర‌గాలి. ఆ ఐదారు సార్లు జ‌ర‌గాలంటే ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుంది. ఇప్ప‌టికే టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర పూర్త‌వుతోంది. తీవ్ర స్థాయిలో అసంతృప్తి టీడీపీపై ఉంది. ఇంకా ఏడాదిన్న‌ర పూర్త‌యితే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఇంకా పెరుగుతుంది. అప్పుడు అన‌ర్హ‌త వేటు వేస్తే వేయ‌నివ్వండి. 11 ఎమ్మెల్యేలే కాదు 4 ఎంపీల‌తో కూడా రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్దాం. ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుందాం. గ‌తంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిన‌ట్టే టీడీపీకి చెబుదాం.` అని వైఎస్ జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌తో వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ అసెంబ్లీకి వెళ్లే ప‌రిస్థితి లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌రు. స‌మ‌యం ఇవ్వ‌రు. కాబ‌ట్టి జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ల‌రు. ఒక‌వేళ అన‌ర్హ‌త వేటు వేస్తే దానిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌ణాళిక‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంద‌ని భావిస్తున్నారు. అయితే ఉప ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీకి గ‌తం మ‌ళ్లీ పునారావృతం అవుతుందో లేదో స్ప‌ష్టం చెప్ప‌లేమ‌న్నది విశ్లేష‌కులు అభిప్రాయం.

వైసీపీపై అన‌ర్హ‌త వేటు వేస్తే..ఎన్నిక‌ల‌కు ? - Tholi Paluku