
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ ఆపగలదా?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ శాసనమండలిలో కీలక చర్చ జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్న ఘనత టీడీపీదంటూ మంత్రి నారా లోకేష్ అన్నారు. 1998లో రూ.1350 కోట్లు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ జరగకుండా టీడీపీ కాపాడిందని తెలిపారు. ఇప్పుడు కేంద్రంతో చర్చిస్తున్నామని చెప్పారు. రూ.11500 కోట్లు ఇచ్చి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా టీడీపీ,బీజేపీ, జనసేన ప్రభుత్వం కాపాడుతుందని శాసనమండలి వేదికగా నారా లోకేష్ స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని నారా లోకేష్ ప్రకటిస్తే సరిపోదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన అంశం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపామంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. తీర్మానం రద్దు చేస్తున్నామన్న ప్రకటన కేంద్రం నుంచి రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకుండా ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రైవేటీకరణ ఆపుతామంటూ ప్రకటించడం విమర్శలకు దారితీస్తోంది. నారా లోకేష్ విశాఖ ఎమ్మెల్యేలు, ఎంపీ, బీజేపీ నేతలతో మాట్లాడితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని, కేంద్రం పై ఒత్తిడి తీసుకొస్తే ఆగుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రూ. 11500 కోట్లతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ముస్తాబు చేసి రిటైల్ గా ప్రైవేటువారికి అమ్ముతున్నారన్న ఆరోపణ ఉంది. అలాంటప్పుడు ప్రైవేటీకరణ ఆపుతున్నామని ప్రకటించడం ప్రజలను నమ్మించి మోసం చేయడం అవుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సొంత గనులు లేకపోవడం కారణంగా విశాఖ ఉక్కు సంస్థ.. ప్రైవేటు కంపెనీల కంటే ఐదారు రెట్లు ఎక్కువ ఖర్చు చేసి ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తోంది.
ఆ ఇనుప ఖనిజం, బొగ్గును సమయానికి రవాణ చేయడానికి రైల్వే వేగన్ లు లేని దుస్థితి. గంగవరం పోర్టుకు వచ్చిన ముడిసరుకును ఆఫ్ లోడ్ చేయక, పెనాల్టీ కట్టాల్సిన దీనస్థితి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న థర్మల్ ప్లాంట్ గతంలో తమకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసి, విద్యుత్ విభాగానికి అదనపు కరెంటును అమ్మిన స్థితి నుంచి ..ఈ రోజు కరెంటు బిల్లులు చెల్లించలేని స్థితికి వచ్చింది. దీనంతటికీ కారణం విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోవడం. సొంత గనులు కేటాయిస్తే ప్రైవేటీకరణ అవసరం ఉండదు. దాదాపు రెండున్నర లక్షల కోట్ల ఆస్తులున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అప్పు దాదాపు రూ. 20 వేల కోట్లు. ఇంత ఆస్తి ఉన్న కంపెనీలో అప్పులను ప్రభుత్వం వాటాగా ఎందుకు మార్చుకోవడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది.
విశాఖ ఉక్కుపై టీడీపీ,బీజేపీ, జనసేనది కపట ప్రేమగా అర్థమవుతోందది. ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేసింది. రాష్ట్ర ప్రజల ముందు తాము కాపాడే ప్రయత్నం చేశామన్న భావన కలిగేలా నారా లోకేష్ వ్యవహారం ఉంది. కానీ చిత్తశుద్ధి లేదు. మిట్టల్ స్టీల్ కు రాయితీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ఏపీ ఎంపీలు విశాఖ స్టీల్ కోసం ఎందుకు కలవలేదు అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రైవేట వారికి దారాధత్తం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రైవేటీకరణ ఆగాలంటే నారా లోకేష్ ప్రకటన సరిపోదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. కేంద్ర కేబినెట్ తీర్మానం ఉపసంహరించుకోవాలి. అప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటు కబంధ హస్తాల్లోకి వెళ్లదు.
