
విశాఖలో ఆపరేషన్ లంగ్స్!
రహదారి కబ్జాల నుంచి విశాఖ నగరం బయటపడుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, రైతు బజార్ల వద్ద ఉన్న బడ్డీల ఆక్రమణలపై జీవీఎంసీ యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ లంగ్స్ పేరిట వారం రోజులు వీటిని తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు.
పెరిగిపోయిన ఆక్రమణలు
మహా విశాఖ క్రమేపీ విస్తరిస్తుంది. రోజురోజుకూ పట్టణీకరణ శాతం పెరుగుతుండడంతో అందుకు తగ్గట్లుగానే ఎక్కడికక్కడ అనధికార నివాసాలు, నిర్మాణాలు వెలుస్తున్నాయి. మరో వైపు ఫుట్‌పాత్‌లు, రహదారులు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. దీంతో వాహనచోదకులతో పాటు పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు చిరు వ్యాపారులు బతుకు తెరువు కోసం బడ్డీలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి సాగిస్తుండగా కొంత మంది వ్యాపార వనరుగా మార్చుకున్నారు. మరికొందరు వ్యాపారులు తమ దుకాణాలు ముంగిట ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని ఇరుకు రహదారులుగా మారుస్తున్నారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో నిరంతరం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.
తొలిరోజు 524 ఆక్రమణలు తొలగింపు
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆపరేషన్ లంగ్స్ విస్తృత కార్యాచరణ చేపట్టినట్టు చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులలో ఎక్కువగా రోడ్లు, ఫుట్‌పాత్ అక్రమణలు, రోడ్ల అంచులలో వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లు ఇరుకుగా మారడం, తరచుగా, ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే అవశ్యకత దృష్ట్యా జీవీఎంసీలో గల 8 జోన్ల ప్రధాన రహదారులలోని ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని నిర్ణయించారు. దీంతో నగరమంతా క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్పు చేయాలని గ్రేటర్ కమిషనర్ కేతన్గార్గ్ సరికొత్త ప్రణాళికతో నడుం బిగించారు.
రెండు లక్షల మొక్కలు
ఒక వైపు ప్రతీ ఏటా నగరంలో రెండు లక్షల కొత్త మొక్కలు నాటే ప్రయత్నం చేయడంతో పాటు నగరమంతా విస్తరించి ఉన్న పార్కులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఫుట్‌పాత్‌లు, ఇతర జంక్షన్లు కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే నగరంలో ఆక్రమణలకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న బడ్డీలు, ఇతర షాపులు, ఇలా అన్నీ కూడా తొలగించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆపరేషన్ లంగ్స్ పేరిట సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దీంతో నగరమంతా కొంత మేరకు ఆక్రమణల చెర నుంచి బయట పడనుంది. కమిషనర్ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్ల అధికారులు పోలీసుల సహకారంతో తొలగించినట్లు సిసిపి తెలిపారు.
అన్ని జోన్లలో తొలగింపు
జోన్1 లో 1,2,3 వార్డుల్లో తగరపువలస మెయిన్ రోడ్డు 20 ఆక్రమణలు, తగరపువలస మెయిన్ రోడ్డు నుండి భీమిలి రోడ్డులో 20 ఆక్రమణలు తొలగిం చామన్నారు. జోన్2లో 7వ వార్డులో నేషనలైవే 16 మిథిలాపురి ఉదా రోడ్ నుండి గాంధీ విగ్రహం వరకు 52 ఆక్రమణలు తొలగించారు. 12. 13 వ వార్డులలో శ్రీకాంత్ నగర్ జంక్షన్ నుండి అంబేద్కర్ జంక్షన్, తోటగరువు జంక్షన్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ తోటగరువు జంక్షన్ మీదుగా పెదగదిలి జంక్షన్ వరకు 38 ఆక్రమణలు తొలగించామన్నారు. జోన్ వార్డు 25, 26, 27లలో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు నుండి గురుద్వారా జంక్షన్‌లో 42 ఆక్రమణలు అలాగే డైమండ్ పార్క్, శాంతిపురం జంక్షన్‌లో 42 ఆక్రమణలు, జోన్-4లో వార్డు 28లో సిరిపురం జంక్షన్ నుండి జగదాంబ క్లాక్ టవర్ వరకు 60 ఆక్రమణలు తొలగించినట్లు తెలిపారు. జోన్-5లో వార్డు 45లో ఎన్‌హెచ్-16 నుండి నరసింహా నగర్ జంక్షన్, డీఎల్బి గ్రౌండ్స్ వరకు 46 ఆక్రమణలు, వార్డు 46 లో డిఎల్బి గ్రౌండ్స్ నుండి సిఎస్ఎఫ్ గేట్ వరకు 3 ఆక్రమణలు, వారు 48 లో సిఎస్ఎఫ్ గేట్ నుండి ఎన్లి జీవోస్ కాలనీ వరకు 6 ఆక్రమణలు, జోన్ -6 లో 65, 66, 67 వార్డులలో పాత గాజువాక ప్రధాన రహదారి నుండి కొత్త గాజువాక ప్రధాన రహదారి వరకు రాజీవ్ నగర్ మార్గ్ రెండువైపుల 53 ఆక్రమణలు, అలాగే 72,73, 74, 76 వార్డులలో కేకేఆర్ వాటర్ ప్లాంట్ నుండి 130 అడుగుల రోడ్డు నుండి వంటిల్లు జంక్షన్ వరకు 33 ఆక్రమణలు తొలగించారు. జోన్7లో 81, 82, 83, 84 వార్డులలో నెహ్రూచౌక్ నుండి సుంకరమెట్ట రోడ్డు వరకు, 42 ఆక్రమణలు, జోన్ 8లో వార్డు 90లో ఎన్ఎస్ఈఎల్ జంక్షన్ నుండి విమాన్నగర్ జంక్షన్ వరకు 22 ఆక్రమణలు అలాగే వ 90,91,92 లలో ఎస్ఏడి కొత్త రోడ్డు నుండి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు 45 ఆక్రమణలు తొలగించడమైనదని మొత్తంగా 524 ఆక్రమణలను తొలగించి ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యానికి వీలు కలిగించేలా ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుక ఆపరేషన్ లంగ్స్ విస్తృతమైన కార్యాచరణ అన్ని జోన్లలో చేపట్టిందని సిసిపి తెలిపారు. ఈ ఆక్రమణల తొలిగింపు కార్యక్రమంలో సంబందిత జోనల్ కమీషనర్లు, సహాయ ప్రణాళికాధికారులు, ప్రణాళికా విభాగము సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొనడం వలన ఈ ఆక్రమణల కార్యక్రమం విజయ వంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఫుడ్ బజార్ తొలగింపు
నగరం నడిబొడ్డున ఉన్న సెంట్రల్ పార్క్ ఎదురుగా రహదారిని పూర్తిగా కబ్జా చేసి ఏర్పాటుచేసిన ఫుడ్ బజార్‌ను శుక్రవారం తొలగించడం ప్రారంభించారు. వైసీపీ పాలనా కాలంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలతో ఏర్పాటైన ఈ అనధికార బజారును తొలగించాలంటూ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కూడా చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ వసూళ్లకు పాల్పడుతూ బజారును కొనసాగించారు. ఇప్పుడు దీనిని కూడా తొలగిస్తున్నారు.
