
వివాదంలో అరుంధతీ రాయ్
బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీరాయ్ రచించిన మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తకాన్ని నిషేధించాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మదర్ మేరీ కమ్స్ టుమీ పుస్తకం పైన అరుంధతీరాయ్ సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటో ముద్రించడంపైన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కవర్ ఫోటోపై ఎలాంటి చట్టబద్ధమైన ఆరోగ్య హెచ్చరిక లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. మదర్ మేరీ కమ్స్ టుమీ పుస్తకం ముద్రణ, ప్రచురణ, ప్రచారం ఆపివేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కరించడానికి.. ఏదైనా ఏజెన్సీ లేదా యంత్రాంగం ఉంటే వాటి గురించి కోర్టుకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి నితిన్ జామ్దార్, జస్టిస్ బసంత్ బాలాజీతో కూడిన ధర్మాసనం కోరింది. ఈ పిటిషన్ విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. అరుంధతీరాయ్ పుస్తకాన్ని నిషేధించాలంటూ న్యాయవాది రాజసింహన్ పిటిషన్ దాఖలు చేశారు. మదర్ మేరీ కమ్స్ టుమీ పుస్తకం కవర్ పేజీ పై పొగతాగుతున్న ఫోటో ముద్రించడం .. పొగతాగడాన్ని గొప్పగాచూపినట్టు ఉందని, ఇలాంటివి మహిళలు, బాలికలకు హానికర సందేశాన్ని పంపుతాయని రాజసింహన్ పిటిషన్ లో పేర్కొన్నారు.
కవర్ పేజీపై ఎలాంటి చట్టబద్ధమైన హెచ్చరిక లేకపోవడం కారణంగా పుస్తకాన్ని నిషేధించాలని రాజసింహన్ పిల్ లో కోరారు. అరుంధతీరాయ్ లాంటి ప్రఖ్యాత రచయిత్రి పొగతాగడాన్ని గొప్పగా చూపడం సమాజంలో తప్పుడు ఆలోచనను పెంచుతుందని రాజసింహన్ వాదించారు. పొగ తాగడం వల్ల మేధో సృజనాత్మకత పెరుగుతుందనే తప్పుడు భావన వస్తుందని పేర్కొన్నారు. మదర్ మేరీ కమ్స్ టుమీ పుస్తకం కవర్ ఫోటో సివోటీపీఏ -2003 చట్టాన్ని కూడా ఉల్లంఘించిందని పిటిషన్ లో రాజసింహన్ పేర్కొన్నారు. పుస్తకం అమ్మకాన్ని నిషేధించడంతో పాటు మార్కెట్లో అందుబాటులో ఉంచిన అన్ని పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే పుస్తకంలో ఉన్న విషయం గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని, కేవలం కవర్ ఫోటోను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు పిటిషనర్ స్పష్టం చేశారు.
