
వివక్ష లేకుండా నిధులు మంజూరు చేశాం
రాజధాని బెంగుళూరులో రోడ్లు సరిగ్గాలేవని, గుంతలు ఏర్పడ్డాయని బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి నిధులు మంజూరు చేశామని, నిధులు ఇచ్చినా ఎందుకు గుంతలను పూడ్చలేదని ప్రశ్నించారు. బెంగుళూరులో సుమారు 7 వేలకు పైగా గుంతలు పూడ్చామని, ఇంకా 5 వేల గుంతలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే అన్నింటిని పూడ్చుతామన్నారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికీ నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు. అలాగే ఈ నెల 24న రోడ్ల పరిస్థితిపై బీజేపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేస్తామనడం సమంజసం కాదన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేశామని వివరించారు.
అధిక వర్షాల వల్లే గుంతలు
ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రకృతి వల్లే ఇలా జరిగిందని డీకే శివకుమార్ అన్నారు. ఎవరూ కావాలని గుంతలను తీయరు. అలాగే నగరంలో వాహనాలు పెరగడం, ట్రాఫిక్ కారణంగా రోడ్లు ఇలా అయ్యాయని తెలిపారు. త్వరలో అన్నింటికి మరమ్మతులు చేస్తామని ఈ సందర్భంగా వీటిపై నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌ను కోరినట్లు వివరించారు. మరోవైపు వివక్షత లేకుండా బీజేపీ ఎమ్మెల్యేలకూ గ్రాంట్లను విడుదల చేసినట్లు డీకే శివకుమార్ తెలిపారు.
వాహనదారుల నిరసన
‘రోడ్లను బాగు చేయండి, బెంగుళూర్ రోడ్లను కాపాడండి’ అంటూ బెంగుళూరులోని వాహనదారులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అయితే రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోతే స్పందించడం లేదని ప్రజలు వాపోయారు. దీంతో నగరంలోని పలు కాలనీవాసులు రోడ్లపైకి వచ్చి, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఈ నిరసనకు అనుమతి లేదని, ముగించాలని కాలనీవాసులను కోరారు. లేకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో తోపులాట జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
