
వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఒకటిగా నిలిపారు: యూపీ సీఎం యోగి
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయ ఐక్యత స్థంభమని, దేశాన్ని ఒకటిగా నిలిపారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధుడు మాత్రమే కాదని, దేశాన్ని కలిపి ఉంచడంలో కీలకపాత్ర పోషించారన్నారు. దూరదృష్టితో అఖండ భారతాన్ని ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అదేవిధంగా హైదరాబాద్, జునాగఢ్ నవాబులను అణచి వేసి స్వతంత్ర భారతదేశంలో కలిసేలా కృషి చేశారన్నారు. అక్టోబర్ 31న పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని కేబినేట్ లో నిర్ణయించాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 నుంచి దేశమంతటా సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం గా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంలో బీజేపీ ప్రతి సంవత్సరం ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. గుజరాత్ లో ప్రపంచంలోనే అతి పెద్ద పటేల్ విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) స్థాపించారన్నారు. దేశంలోని అన్ని గ్రామాల నుంచి అన్ని వర్గాల నుంచి ఉక్కును, దేశానికి చెందిన మట్టిని సేకరించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మోడీని కొనియాడారు. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చారన్నారు. అలాగే దేశ మొదటి ఉప ప్రధాని, హోంమంత్రి అయిన పటేల్ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను రూపోందించామని తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యత యాత్రను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడంలో ఆయన అనిర్వచనీయమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాగే స్వతంత్ర ఉద్యమంలో స్పూర్తి దాయకమైన పాత్రను పోషించారని ప్రశంసించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ఏక్ భారత్–శ్రేష్ట భారత్ మిషన్‌లో భాగంగా వికాసిత్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.
ఇందులో భాగంగా పాదయాత్రతో పాటు జిల్లా స్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు సర్దార్ ఉప్ వన్ లో భాగంగా చెట్లు నాటడం, మహిళల కోసం సంక్షేమ శిబిరాలను ఏర్పాటు చేయడం, యోగా, ఆరోగ్య శిబిరాలు, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా చేసి, స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించి, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మార్చడమే లక్ష్యంగా కార్యక్రమాల రూపకల్పన ఉంటుందన్నారు.
