
వల్లభాయ్ పటేల్ చరిత్రను తుడిచివేయడానికి కాంగ్రెస్ కుట్ర చేసింది: జేపీనడ్డా
భారత ఐక్యతకు ప్రాణం పోసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను చరిత్ర పుటల నుంచి తుడిచివేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కుట్రాపూర్వకంగా ప్రయత్నం చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరోపించారు. శనివారం గుజరాత్‌లోని అట్లాడ్రా గ్రామంలో నిర్వహించిన ‘సర్దార్@150 యూనిటీ మార్చి’ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు సర్దార్ పటేల్ పేరు కూడా గుర్తుండకూడదని కోరిక. దేశాన్ని ఏకం చేసిన ఈ మహానేతను చరిత్ర నుంచి పూర్తిగా తొలగించేందుకు పార్టీ దశాబ్దాల పాటు ప్రయత్నించిందని మండిపడ్డారు. సర్దార్ పటేల్ 1950లో మరణించినా, ఆయనకు భారతరత్న అవార్డు 1991లోనే ఇచ్చారని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆయన గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు నిజమైన నివాళిగా గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించారని, కానీ ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ‘ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇది ఏం సాధిస్తుంది?’ అని ప్రశ్నించారని విమర్శించారు.
ఆర్టికల్ 370పై నెహ్రూ వైఫల్యం
562 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన సర్దార్ పటేల్ ఘనతను కాంగ్రెస్ మరుగుపరిచిందని, కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా నిర్ణయం తీసుకున్నారని నడ్డా ఆరోపించారు. మహారాజా హరిసింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం చేశారు. సర్దార్ పటేల్ ఆ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేశారు. అయినా నెహ్రూ ఆర్టికల్ 370ని రుద్దారు. దేశ ఐక్యతకు అడ్డంకిగా మారిన ఈ నిబంధనను నెహ్రూ రుద్దడం ఒక దుర్మార్గమేనని విరుచుకుపడ్డారు. మోడీ సంకల్పం, అమిత్ షా విధానాలతోనే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యత కోసం ఎంత కృషి చేశారో గుర్తుంచుకోవాలి. దేశాన్ని బలహీనపరిచే పనులు ఎవరు చేశారో కూడా మరచిపోకూడదని నడ్డా సూచించారు.
