Let's talk: editor@tmv.in
వలసదారులపై ఉక్కుపాదం?

వలసదారులపై ఉక్కుపాదం?

FL - TRND
15 సెప్టెంబర్, 2025

లండన్ వీధుల్లో ఇటీవల జరిగిన భారీ ర్యాలీ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వలస వ్యతిరేక భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్షకు పైగా ప్రజలు ఒకే చోట గుమికూడడం యూకేలో గత కొన్నేళ్లలో చూడని ఘట్టంగా నిలిచింది. జాతీయ పతాకాలు, క్రైస్తవ చిహ్నాలు, నినాదాలతో కేంద్ర లండన్ రహదారులు నిండిపోయాయి. మరోవైపు వలసలకు మద్దతు ఇస్తూ స్టాండ్ అప్ టు రేసిజం అనే సంస్థ నుంచి కూడా వేలాది మంది ప్రతిఘటనా ప్రదర్శన నిర్వహించారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్స్లే లెనన్. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ స్థాపకుడిగా అతను ఒకప్పుడు వీధి స్థాయి ఉద్యమాలకు మార్గం చూపాడు. కాలక్రమేణా ఆ సంస్థ హింసాత్మక ఘర్షణలకు పాల్పడింది. రాబిన్సన్ తరువాత ఆ సంస్థను వదిలినా సోషల్ మీడియా ద్వారా తన ప్రభావాన్ని కొనసాగించాడు. అనేక నేరాలకు శిక్ష అనుభవించినా, దివాళా ప్రకటించినా, విరాళాలను వృథా చేశానని ఒప్పుకున్నా అతని అనుచరులు తగ్గలేదు. ట్విట్టర్లో అతనికి ఇప్పుడు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజా ర్యాలీలో స్వేచ్ఛా హక్కులను రక్షించుకోవాలని, వలసలను నియంత్రించాలని నినాదాలు మార్మోగాయి. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారుల టోపీలు ధరించి పాల్గొన్నారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు.

టామీ రాబిన్సన్ అనుచరులకు ఆయన దేశభక్తుడిగా కనిపిస్తుంటే విమర్శకులకు మాత్రం విభజనకు కారణమయ్యే వ్యక్తిగా, విద్వేషాన్ని రెచ్చగొట్టే నాయకుడిగా కనిపిస్తున్నాడు. వలసల సమస్య యూకే రాజకీయాల్లో ప్రధానాంశంగా మారిన ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం లాంటి విషయాలు పక్కన పడిపోయి వలసలపై ఆగ్రహమే ముందుకు రావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ ఘటన కేవలం ఒక ర్యాలీ కాదు, యూకే సమాజంలో పెరుగుతున్న విభేదాల ప్రతిబింబం. ఒకవైపు స్వేచ్ఛ, జాతీయ గౌరవం పేరుతో వీధుల్లోకి వచ్చిన జనసందోహం, మరోవైపు మైనారిటీ కమ్యూనిటీలలో పెరుగుతున్న భయం కలిసి బ్రిటన్ భవిష్యత్తు దిశ ఏంటనే ప్రశ్నను మరింత గంభీరంగా ముందుకు తెచ్చాయి.

వలసదారులపై ఉక్కుపాదం? - Tholi Paluku