Let's talk: editor@tmv.in
వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: పార్వతీపురం జిల్లా కలెక్టర్

వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: పార్వతీపురం జిల్లా కలెక్టర్

Shaik Mohammad Shaffee
27 అక్టోబర్, 2025

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగరాదని, ఇందుకోసం ముందుగా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అధికారులకు శాఖల వారీగా విధులను కేటాయించడం జరిగిందని, అధికారులకు అప్పగించిన బాధ్యతలను తూ.చ తప్పకుండా పాటించాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదీ లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 27 నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను దండోరా, మైక్ ద్వారా ప్రచారం చేస్తూ అప్రమత్తం చేయాలని అన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, ఇసుకను త్రవ్వడం వంటి పనులు చేపట్టరాదని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.

రైతులకు ఎటువంటి పంట నష్టం జరగకుండా చూడాలని, పంట కాలువలు, గట్లు తెగిపోకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని తెలిపారు. శిథిలావస్థలోని భవనాలు, పాఠశాలల్లో ఎవరూ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు ఆరుబయట తిరగకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల పట్ల విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిత్యం అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, వైద్య ఆరోగ్యం పట్ల ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు. ప్రజలు సమాచారం పొందడం, తీసుకోవడం చేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: పార్వతీపురం జిల్లా కలెక్టర్ - Tholi Paluku