
వర్షపు నీటి గుంటలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
చెన్నై శివార్లలోని మంగడూ ప్రాంతంలో హృదయవిదారక ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నీటి గుంటలో రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడి మరణించింది. ఈ సంఘటనతో జనని నగర్ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
ఇంటి సమీపంలో జరిగిన దుర్ఘటన
మృతురాలైన బాలిక ప్రేణికశ్రీ (2 సంవత్సరాల 10 నెలలు) చెంగల్పట్టు సమీపంలోని మంగడూ, జనని నగర్‌లో తన తల్లి ప్రియదర్శిని (23)తో నివసిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం అక్టోబర్ 22న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తల్లీ బిడ్డ నిద్రపోయారు. సాయంత్రం సుమారు 4:30 గంటల ప్రాంతంలో నిద్రలేచి చూసేసరికి బిడ్డ కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన ప్రియదర్శిని పొరుగువారితో కలిసి బిడ్డ కోసం వెతుకుతుండగా ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్‌లో వర్షపు నీటి గుంటలో చిన్నారి మునిగిపోయి కనిపించింది. దీంతో తల్లి హుటాహుటిన ఆ చిన్నారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రేణిక చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగడూ పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ సాక్ష్యాలు సేకరిస్తున్నారు.
స్థానికులు ఇలాంటి గుంటలను మూసివేయడం లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గతంలోను ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ తగిన చర్యలు లేకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నగర పాలక సంస్థ అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
