
వర్థమాన గాయని సాధ్యకు సీఎం ప్రశంస
గుంటూరుజిల్లా కాకుమానుకు చెందిన చిన్నారి సాధ్య అంతర్జాతీయ వేదికలపై చిన్నతనంలోనే శ్రావ్యంగా పాటలు పాడుతూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. చిన్నారి గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. గాయని సాధ్య, ఆమె తల్లిదండ్రులు స్వైరా, సిరి కృష్ణ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు.
చిన్నారి సాధ్య వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకుందని ఆమె తల్లిదండ్రులు సీఎంకు వివరించారు. సోలో ప్రదర్శనలలో సాధ్య విజయాలు సాధించిందని.. యార్క్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో ఓపెరా హౌస్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఆమె ఏడు సార్లు ప్రథమ స్థానం, ఏడు సార్లు ద్వితీయ స్థానం, రెండు సార్లు తృతీయ స్థానాల్లో విజయం సాధించిందని ఆమె తల్లిదండ్రులు సీఎంకు తెలిపారు. వీటితో పాటు మూడు గౌరవప్రదమైన బహుమతులు, మూడు ప్రత్యేక బహుమతులు కూడా సొంతం చేసుకుందని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 22 ప్రదేశాల్లో 22 ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పాటల పోటీల్లో పాల్గొందని... ప్రతిచోటా అవార్డులు సొంతం చేసుకుందని వివరించారు. అలాగే యూరో ఎలైట్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్, కెనడియన్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్, రాయల్ మాస్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్ వంటి అగ్రశ్రేణి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని సాధ్య తన ప్రతిభను చాటుకుందని సీఎం దృష్టికి ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సాధ్యను సంగీతంలో రాణించేలా ప్రొత్సహిస్తున్న ఆమె తల్లిదండ్రులను సీఎం అభినందించారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన కాటూరు మెడికల్ కాలేజీకి, హాస్పటల్ అధినేత మనుమరాలైన సాధ్య మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
కాగా ద ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బెంగుళూరు లో సాధ్య సెవెన్త్ గ్రేడ్ చదువుతుంది. ఏడవ తరగతి చదువుతున్న సాధ్య ప్రతిష్టాత్మకమైన 'స్పెషల్ వెన్యూ అవార్డ్స్' గెలుచుకోవడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ అవార్డుల కారణంగా, అంతర్జాతీయ పోటీల నుండి ఎంపిక చేసిన విజేతలు పాల్గొనే ప్రత్యేక రిసైటల్‌లో ప్రదర్శన ఇవ్వడానికి ఆమెకు హార్వర్డ్ యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో వార్ మెమోరియల్ ఒపేరా హౌస్లలో ఆహ్వానం అందింది. హార్వర్డ్‌లోఆమె హార్వర్డ్ అధ్యాపకులతో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని పొందింది. ఈ అధ్యాపకులు పియానోపై ఆమెకు తోడుగా వాయించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒపేరా హౌస్‌లో జరిగిన ఆమె ప్రదర్శన కోసం, శాన్ ఫ్రాన్సిస్కో ఫిల్‌హార్మోనిక్ నుండి డాక్టర్ అకి ఆమెకు వాద్య సహకారం అందించారు.
హార్వర్డ్, శాన్ ఫ్రాన్సిస్కోలలో, వెస్ట్రన్ వోకల్ మ్యూజిక్, కాంటెంపరరీ స్టైల్స్, బ్రాడ్‌వే మ్యూజికల్ థియేటర్ విభాగాలలో సాధ్య కనబరిచిన అద్భుతమైన ప్రతిభకు గౌరవం దక్కింది. ఆమె సాధించిన ఈ విజయాలు, ఆమె ప్రతిభ, నిబద్ధత, నిజమైన అంతర్జాతీయ గుర్తింపు ప్ర యాణాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ పాఠశాల యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా కొనియాడారు.
