
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ గజాలా హష్మీ
వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాద్‌లో జన్మించిన అమెరికన్ రాజకీయ నాయకురాలు గజాలా హష్మీ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అత్యున్నత రాజకీయ పదవికి ఎన్నికైన మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
61 ఏళ్ల డెమోక్రాట్ నాయకురాలైన హష్మీ తన రిపబ్లికన్ ప్రత్యర్థి జాన్ రీడ్‌పై ఘన విజయం సాధించారు. 79 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి హాష్మీ 1,465,634 ఓట్లు (54.2 శాతం) సాధించి, 1,232,242 ఓట్లు పొందిన జాన్ రీడ్ కంటే చాలా ముందున్నారు.
2025 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కీలక పదవుల కోసం పోటీ చేసిన 30 మందికి పైగా భారతీయ-అమెరికన్, దక్షిణాసియా అభ్యర్థులలో ఒకరు. రాష్ట్రంలో అత్యున్నత పదవికి పోటీ పడటం వలన హష్మీ ఎన్నిక అత్యంత ఆసక్తిగా మారింది. హష్మీ వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా అమెరికన్ కూడా.
ఆమె అధికారిక వివరాల ప్రకారం, హష్మీ విద్యా రంగం, సామాజిక న్యాయం, సమానత్వం, ఓటు హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, గర్భస్రావ స్వేచ్ఛ, తుపాకీ హింస నివారణ, పర్యావరణ పరిరక్షణ, వసతి సౌకర్యం, తక్కువ ఖర్చుతో ఆరోగ్య సేవలు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా ఉంచారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఎన్నికలలో ఆమె సాధించిన చారిత్రక విజయాన్ని ది ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ అనే కమ్యూనిటీ సంస్థ అభినందించింది. ఆ సంస్థ ఆమె ఎన్నికల ప్రచారానికి 1.75 లక్షల అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్, హాష్మీ విజయాన్ని కమ్యూనిటీకి, కామన్వెల్త్‌కు మరియు ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.
హష్మీ 2019లో మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించి, ప్పటి రిపబ్లికన్ సిట్టింగ్ అభ్యర్థిని ఓడించి, డెమోక్రాట్లకు సెనేట్‌లో మెజార్టీ సాధించిపెట్టారు. ఇప్పుడు మళ్లీ చరిత్ర సృష్టించి, వర్జీనియాకు తొలి దక్షిణాసియా, ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్‌గా నిలిచారు.
2024లో ఆమెను సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. సెనేటర్‌గా హష్మీ విద్య, ఆరోగ్యం, గృహ వసతి, పర్యావరణ న్యాయం వంటి అంశాలపై కృషి చేశారు.
హైదరాబాద్‌లో పుట్టి..
గజాలా హష్మీ.. 1964లో హైదరాబాద్‌లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించారు. తన బాల్యాన్ని మల్‌పేట్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో గడిపారు. భారతదేశం నుంచి వలస వచ్చినప్పుడు ఆమెకు నాలుగేళ్లు. తండ్రి అమెరికాలో ఉన్నత విద్య కోసం జార్జియాలో ఉండగా, తల్లి, అన్నతో కలిసి అక్కడ చేరారు. అప్పుడు అమెరికా పాఠశాలల్లో వర్ణవివక్షను తొలగించే ప్రక్రియ జరుగుతుండగా, సమానత, సాంస్కృతిక వైవిధ్యం విలువలను చిన్ననాటి నుంచే అనుభవించారు.
ఆమె హైస్కూల్‌లో వాలెడిక్టోరియన్‌గా నిలిచి పలు స్కాలర్‌షిప్‌లు పొందారు. అనంతరం జార్జియా సదర్న్ యూనివర్సిటీలో బీఏ (గౌరవ) డిగ్రీ, ఎమోరీ యూనివర్సిటీ (అట్లాంటా)లో అమెరికన్ సాహిత్యంలో పీహెచ్‌డీ పొందారు.
భర్త అజహర్‌తో 1991లో రిచ్‌మండ్ ప్రాంతానికి వచ్చి, దాదాపు 30 సంవత్సరాలు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మండ్, రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీలో బోధించారు. అక్కడే ఆమె సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు.
