Let's talk: editor@tmv.in
వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: నల్గొండ కలెక్టర్ హెచ్చరిక

వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: నల్గొండ కలెక్టర్ హెచ్చరిక

Gaddamidi Naveen
28 అక్టోబర్, 2025

వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె పాగిడిమర్రిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పాటించాల్సిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం పూర్తిగా ఆరిన, నాణ్యమైనదై ఉండాలని, రైతులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.

తేమ పరీక్షలు తప్పనిసరి: ప్రతిరోజు ధాన్యానికి తేమ పరీక్ష నిర్వహించడం తప్పనిసరి అని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేసిన ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి, వర్షం నుండి రక్షించాలని, ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను (నీరు, టెంట్లు) కల్పించాలని ఆమె సూచించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడటానికి, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటానికి కట్టుబడి ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి పునరుద్ఘాటించారు. రైతు కష్టం వృథా కాకుండా, ప్రతి గింజను సకాలంలో కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే లేదా నిర్లక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: నల్గొండ కలెక్టర్ హెచ్చరిక - Tholi Paluku