
వరిపై స్టాలిన్ వర్సెస్ నిర్మలా సీతారామన్
తమిళనాడు ప్రభుత్వం వరి రైతులకు ఇస్తున్న అదనపు బోనస్‌ను పునఃసమీక్షించి, దానిని నిలిపివేయాలని కేంద్రం సూచించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సోమవారం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చిందని పేర్కొంటూ, ఆ లేఖను ప్రజల ముందుకు తీసుకురావడానికి సిద్ధమా అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలకు గంటల వ్యవధిలోనే స్పందించిన సీతారామన్, ఆ లేఖ ప్రతిని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. వ్యవసాయం, ఆహార భద్రత వంటి కీలక అంశాల్లో కేంద్రం–రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం పంపిన లేఖ ఒక సూచన మాత్రమే గానీ ఆదేశం కాదని స్పష్టం చేశారు.
నూనెలు, పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం
దేశ ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే పప్పుధాన్యాలు, నూనెగింజలు, మిల్లెట్లు వంటి పంటల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని సీతారామన్ అన్నారు. భారతదేశం పెద్ద మొత్తంలో తినే నూనెలు, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటోందని, ఈ పరిస్థితిని మార్చాలంటే రైతులను ఆ పంటల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో పామ్ ఆయిల్ దిగుమతులు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం దేశీయంగా నూనెగింజల ఉత్పత్తి తక్కువగా ఉండటమేనని తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం కార్యదర్శి రాష్ట్రాలకు పంపిన లేఖలో వరి, గోధుమలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి అదనంగా ఇచ్చే బోనస్ విధానాన్ని పునఃసమీక్షించాలని సూచించినట్లు వెల్లడైంది. వరి, గోధుమల అధిక ఉత్పత్తి వల్ల ప్రభుత్వ నిల్వలు అవసరానికి మించి పెరిగి ప్రజా ధనంపై భారంగా మారుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, స్టాలిన్ సోషల్ మీడియా పోస్టులో మాట్లాడుతూ కేంద్రం పంపిన లేఖలో వరిపై అదనపు బోనస్ నిలిపివేయాలని స్పష్టంగా సూచించారని చెప్పారు. తాను చెప్పింది ఆ లేఖలో ఉన్న విషయమేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సీతారామన్ స్పందిస్తూ స్టాలిన్ వ్యాఖ్యలను వాస్తవాలకు విరుద్ధంగా, రాజకీయ ప్రేరణతో చేసిన వ్యాఖ్యలుగా అభివర్ణించారు. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రైతుల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. దేశ ఆహార భద్రత కోసం పప్పుధాన్యాలు, నూనెగింజలు, మిల్లెట్లు వంటి పంటల ఉత్పత్తిని పెంచడం అవసరమని, దీనిపై కేంద్రం రాష్ట్రాలతో సహకారపూర్వకంగా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. వరి బోనస్ అంశంపై తమిళనాడు ప్రభుత్వం,కేంద్రం మధ్య మాటల యుద్ధం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
