
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ పవన్ సంచలనం
నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ వేదికపై భారత ఆటగాళ్లు పంచుల వర్షం కురిపించారు. బాక్సింగ్ రింగ్‌లో పవన్ బార్ట్వాల్ సంచలనంతో మొదలైన భారత దూకుడు. బ్రెజిల్ వరల్డ్‌కప్ గోల్డ్‌మెడలిస్టును 5–0తో మట్టికరిపించి దేశానికి మరో స్ఫూర్తిదాయక విజయాన్ని అందించాడు. సుమిత్, నవీన్ విజయాలు సాధించడంతో భారత పతకాల సంఖ్యను ఏకంగా ఏడుకు చేరింది.
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్–2025లో భారత బాక్సర్లు ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్నారు. రెండో రోజైన సోమవారం పవన్ బార్ట్వాల్ (55కేజీల విభాగంలో) టోర్నీలోనే సంచలనాన్ని నమోదు చేశాడు. బ్రెజిల్ వరల్డ్ కప్ గోల్డ్ మెడలిస్ట్, రెండో సీడ్ అయిన కజకిస్తాన్ బాక్సర్ అల్‌టిన్‌బెక్ నూర్‌సుల్తాన్‌ను 5–0తో చిత్తు చేసి పవన్ తన తొలి అంతర్జాతీయ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2010ల్లో బాక్సింగ్ ప్రారంభించిన పవన్‌కు ఇది 15 ఏళ్ల కృషికి దక్కిన ప్రతిఫలంగా నిలిచింది. డిఫెన్స్‌లో దిట్ట, రింగ్‌లో టెంపో కంట్రోల్, స్టామినా ఇలా అన్ని ఉన్న నూర్‌సుల్తాన్‌ను ప్రతి రౌండ్ లోనూ రోప్‌ల వైపు నెట్టాడు. స్వదేశంలోని అభిమానుల హోరు మధ్య పవన్ మరింత ఉత్సాహంగా ఆడాడు.
‘ఇది నా కెరీర్‌లో కీలకమైన టోర్నమెంట్. మన దేశంలో పోటీ పడటం నాకు ధైర్యం ఇచ్చింది. ఇది నా తొలి అంతర్జాతీయ పతకం. గర్వంగా ఉంది’ అని పవన్ చెప్పాడు.
సుమిత్, నవీన్ విజయంతో 7కు చేరిన భారత పతకాల సంఖ్య
75కేజీల క్వార్టర్ ఫైనల్లో సుమిత్, కొరియా బాక్సర్ కిమ్ హ్యోన్–తేను 5–0తో ఓడించాడు. మ్యాచ్ ప్రారంభంలోనే విసిరిన ఓ పదునైన పంచ్‌తో ఆధిపత్యం సాధించిన సుమిత్, మొత్తం పోరాటంలోనూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ డిఫెన్సులోకి నెట్టాడు.
90కేజీలో నవీన్, కజకిస్తాన్‌కు చెందిన బెక్‌జాత్ టాంగటార్‌పై మంచి వ్యూహంతో బౌట్ కంట్రోల్ చేశాడు. పొడవు, రీచ్ విషయంలో లీడ్ తీసుకుని స్పష్టమైన స్కోరింగ్ షాట్లు కొట్టాడు. మొదటి రౌండ్ సమానంగానే సాగినా, తర్వాతి రౌండ్లలో నవీన్ స్పీడ్ పెంచి సరైన నిర్ణయంతో విజయం సాధించాడు.
ఇతర సెషన్ ఫలితాలు
తైవాన్ ఒలింపిక్ పతక విజేత వూ షిహ్–యి, ఉజ్బెకిస్తాన్ బాక్సర్ సితోరా టుర్దిబెకోవాపై 5–0తో భారీ విజయం సాధించాడు.
పురుషుల 55కేజీ, 75కేజీల విభాగాల్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్‌లు సమందర్ ఒలిమోవ్, జావోఖీర్ అబ్దురఖిమోవ్, అలాగే ఇంగ్లాండ్‌కు చెందిన ఎలిస్ ట్రోబ్రిడ్జ్ ముందుకు దూసుకెళ్లారు. కజకిస్తాన్, ఉక్రెయిన్, పోలాండ్ బాక్సర్లు కూడా కీలకమైన విజయాలు సాధించారు.
సాయంత్రం సెషన్‌లో భారత్ ఎదుర్కొన్న కీలక పోటీలు
50కేజీల్లో జడుమణి సింగ్, కజకిస్తాన్ రైజింగ్ స్టార్ ఒంగారోవ్ నుర్జాత్‌తో తలపడనున్నాడు.
హైలైట్ మ్యాచ్ – 70కేజీలో హితేష్, టాప్‌సీడ్ సివోన్ ఒకజావా (జపాన్) మధ్య జరగనుంది. టెక్నికల్ ప్రిసిషన్‌తో ప్రసిద్ధి చెందిన ఒకజావా కారణంగా ఈ పోరాటం అత్యంత ఆసక్తికరంగా మారనుంది.
