Let's talk: editor@tmv.in
వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి ఏపీలో ఘన స్వాగతం

వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి ఏపీలో ఘన స్వాగతం

Panthagani Anusha
8 నవంబర్, 2025

మహిళల వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు స్టార్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఆనంద జల్లు కురిసింది! ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఘనంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడకు బయలుదేరిన శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.ఆమెకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ విజయం సాధించినందుకు శ్రీచరణిని సీఎం హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీచరణి వరల్డ్ కప్ గెలిచిన ఆనంద క్షేణాలను సీఎంతో పంచుకుంది. “టీమ్ ఇండియా సత్తా చాటింది. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది” అంటూ చంద్రబాబు ఆమెను కొనియాడారు.

భారత మహిళలు ప్రపంచానికి తమ శక్తిని చాటారు అని ఆయన ఉద్ఘాటించారు. అంతకుముందు గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని ఏసీఏ ప్రణాళిక వేసింది. కానీ సీఎం భేటీ నేపథ్యంలో దాన్ని రద్దు చేశారు. చంద్రబాబును కలిసిన అనంతరం శ్రీచరణి మంగళగిరి క్రికెట్ స్టేడియంను సందర్శించింది.సాయంత్రం సొంత జిల్లా కడపకు చేరుకోనున్న శ్రీచరణికి ఏసీఏ సహకారంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఘన సత్కారం సిద్ధం చేసింది. నగరంలో భారీ ర్యాలీతో ఆమె విజయాన్ని జనం జోష్‌తో జరుపుకోనున్నారు.విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రానికి గర్వకారణమైంది. భారత మహిళల క్రికెట్‌కు శ్రీచరణి విజయం కొత్త ఊపు, కొత్త ఆరంభంగా నిలిచింది.

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విజయం సాధించిన టీమ్‌ ఇండియాలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్‌ ఎన్. శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం భారీ గౌరవం ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు రూ. 2.5 కోట్లు నగదు బహుమతి, కడప జిల్లాలో 1,000 చదరపు అడుగుల నివాస స్థలం, గ్రూప్–1 ఉద్యోగం అందజేయాలని నిర్ణయించారు.