Let's talk: editor@tmv.in
‘వరల్డ్ కప్ మనదే’: బీసీసీఐ ఉపాధ్యక్షుడు ధీమా

‘వరల్డ్ కప్ మనదే’: బీసీసీఐ ఉపాధ్యక్షుడు ధీమా

Koripelli Aditya
1 నవంబర్, 2025

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ విజయాన్ని అభినందించారు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత మహిళల క్రికెట్ భవిష్యత్తు ధగధగలాడుతోందని, నవంబర్ 2న జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘భారత మహిళల జట్టు అద్భుతంగా ఆడింది. ఆస్ట్రేలియాను చిత్తు చేసి 339 రన్స్ ఛేజ్ చేయడం అసాధారణం. నవంబర్ 2న దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ చాంపియన్‌లుగా నిలుస్తామని ఆశిస్తున్నా. మహిళల క్రికెట్ భారత్‌లో రోజు రోజుకి బాగా ఎదుగుతుంది’ అని శుక్లా మీడియా ద్వారా తెలిపారు.

మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన ఛేజ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సెంచరీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరో కీలక ఇన్నింగ్స్‌తో 339 రన్స్ ఛేజ్ సాధ్యమైంది. మహిళల వన్డేల్లో ఇదే అత్యధిక ఛేజ్, 50 ఓవర్ల వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో (పురుషులు, మహిళలు కలిపి) ఇదే టాప్ ఛేజ్.

మ్యాచ్ అనంతరం బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా జట్టు ‘నెవర్ సే డై’ స్ఫూర్తిని కొనియాడారు. ‘మన మహిళలు నిజంగా వారిని శక్తిని నిరూపించుకున్నారు. వాళ్ల నిబద్ధత, పట్టుదల, ఓడిపోని మనస్తత్వం ఈ రోజు కనిపించింది. ఆదివారం కూడా ఈ విజయపరంపర కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

శివసేన నేత ఆదిత్య ఠాక్రే శుక్రవారం సోషల్ మీడియాలో జెమీమా, హర్మన్‌ప్రీత్‌లను అభినందించారు. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన రికార్డు ఛేజ్‌ను ‘క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింద’ని కొనియాడారు. ‘జెమీమా అద్భుత బ్యాటింగ్, హర్మన్ సపోర్ట్... ఇదే చాంపియన్‌ల స్టఫ్. డీవై పాటిల్ స్టేడియం కూడా అద్భుత వేదిక’ అని పేర్కొన్నారు. దీప్తి శర్మ సోదరుడు సుమిత్ శర్మ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనను మెచ్చుకున్నారు. ‘భారత మహిళల జట్టుకు అభినందనలు, రాబోయే మ్యాచ్‌కు శుభాకాంక్షలు. 338 ఛేజ్ చేసి టీమ్ గేమ్ ఆడారు. దీప్తి కీలక పాత్ర పోషిస్తూ వరల్డ్ కప్ తీసుకొచ్చేలా ప్రార్థిస్తున్నా. ఫైనల్‌లో ఖచ్చితంగా గెలుస్తాం’ అని అన్నారు.