
‘వరద’ సాయం ఏమైంది?
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. వానాకాలం కంటే ముందే నాలాలు శుభ్రం చేయకపోవడం, వరద సమయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం కూడా చేయలేదని, భారీ వర్షాలకు ఎనిమిది మంది చనిపోయినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని రాంగోపాల్‌పేట డివిజన్‌లో వరదలో మునిగిపోయిన కాలనీలను హరీశ్ రావు పరిశీలించి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో నాలాలు శుభ్రం చేసేవారమని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ బాధ్యతలను కూడా చూసుకుంటూ హైదరాబాద్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది? అప్పటి చర్యలు, విమర్శలు ఏమిటి? అన్న చర్చ కూడా జరుగుతున్నది.
హరీశ్ రావు ఆరోపణలు ఇవే..
"వరదలతో ఇంట్లో వస్తువులు కొట్టుకుపోయాయి. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం సాయం చేయడం లేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణశాఖ ముందే హెచ్చరించినా చర్యలు తీసుకోలేదని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉంటున్నారని, బాధితులను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఏమంటోంది?
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నది. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటున్నదని కాంగ్రెస్ చెబుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించారని.. వరద సాయం కోసం కేంద్రానికి అభ్యర్థనలు పంపుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారని చెబుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారా? అని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరద సాయం కోసం ప్రతి జిల్లాకు రూ.1 కోటి సాయం చేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీఆర్‌ఎస్ మీద ఎన్నో విమర్శలు
గతంలో బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) పాలనలో 2020లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చాయి.
అప్పట్లోనూ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. వరద బాధితుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.పదివేలు ఆర్థిక సాయం చేసినా అది కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేశారన్న విమర్శలు వచ్చాయి. మొత్తం 4.3 లక్షల కుటుంబాలకు ఈ సాయం అందించారని బీఆర్ఎస్ చెప్పుకున్నది. కానీ కేవలం బీఆర్ఎస్ నేతలు చెప్పినవాళ్లకు మాత్రమే ఈ డబ్బు ఇచ్చాన్న ఆరోపణలు వచ్చాయి.
రోడ్ల దుస్థితికి కారణాలు ఏమిటి? హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటం. నాలాలు కబ్జాకు గురి కావడం.. చెరువులు సైతం అక్రమార్కుల కబ్జా చేయడం వంటి కారణాలతో హైదరాబాద్ ప్రజలకు వరద కష్టాలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో ఈ కబ్జాలను పెద్దగా అరికట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను తీసుకొచ్చి చెరువులను బాగు చేస్తున్నామని.. నాళాలను కబ్జా చెర నుంచి విడిపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కేంద్రం సాయం అందుతోందా?
వరద సాయం విషయంలో కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వరదలు ప్రకృతి విపత్తులే అయినా, ప్రభుత్వాల స్పందన, ముందస్తు చర్యలు కీలకం. రాజకీయ విమర్శలు కాకుండా, బాధితుల సాయంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరద సాయం విషయంలో రోడ్ల మరమ్మతు విషయంలో ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి తప్ప శాశ్వత పరిష్కారాలు చూపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలోనూ హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతున్నది. మొత్తంగా రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతోంది.
